News

శరీరంలో తూటాలు దిగినా.. ఉగ్రవాదులను వదల్లేదు..!

513views

* పుల్వామా ఎన్‌కౌంటర్ ‌లో గరుడ్‌ కమాండో వీరోచిత పోరాటం

పక్క ఉగ్రవాదులు కాల్చిన తూటాలు శరీరంలో దిగినా.. లెక్క చేయకుండా ఎదురు దాడి చేశాడో గరుడ్‌ కమాండో. ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాడు. ఈ ఘటన శనివారం పుల్వామా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో చోటుచేసుకొంది. పుల్వామాలోని నైరా గ్రామం వద్ద ఉగ్రవాదులు నక్కినట్లు శనివారం భద్రతా దళాలకు సమాచారం వచ్చింది. దీంతో 55 రాష్ట్రీయ రైఫిల్స్‌, జమ్ము కశ్మీర్‌ పోలీసులు, గరుడ్‌ కమాండోలు కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఉన్న ఇంటిని గుర్తించారు. వెంటనే స్థానికులను ఇతర ప్రాంతాలకు తరలించి.. దళాలు ఉగ్రస్థావరాన్ని చుట్టుముట్టాయి. ఈ విషయం గ్రహించిన ఉగ్రవాదులు భద్రతా దళాల ఉచ్చు నుంచి తప్పించుకోవడం కోసం ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టారు. ముష్కరులు నేరుగా సైన్యం, గరుడ్‌ కమాండోలపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో స్క్వాడ్రన్‌ లీడర్‌ సందీప్‌ ఝాజరియా శరీరంలోకి రెండు తూటాలు చొచ్చుకుపోయాయి. ఒకటి ఛాతి సమీపంలో, మరొకటి ఎడమ చేతిపై దిగాయి. అయినా.. వెనక్కి తగ్గలేదు. ఉగ్రవాదులతో పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత అక్కడే నక్కి ఉన్న మరో ఉగ్రవాది కాల్పులు జరపడంతో కార్పొరల్‌ ఆనంద్‌ గాయపడ్డాడు. దీంతో అప్రమత్తమైన దళాలు ఆ ఉగ్రవాదిని కూడా మట్టుబెట్టాయి.

మొత్తానికి గరుడ్ కమాండోల సాహస శౌర్య పరాక్రమాలను దేశమంతా ప్రశంసిస్తోంది. మరీ ముఖ్యంగా శరీరంలోకి బుల్లెట్లు దిగినా లెక్క చెయ్యకుండా తీవ్రవాదులను అంతం చేసిన స్క్వాడ్రన్‌ లీడర్‌ సందీప్‌ ఝాజరియా సాహసాన్ని వేనోళ్ళ కొనియాడుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.