ArticlesNews

వెయ్యేళ్లనాటి భారతీయ కమ్యూనిజం

919views
  • ముచ్చింతల్ లో ఫిబ్రవరి 2 నుంచి శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం ప్రారంభం

వెయ్యేళ్ళ క్రితం దక్షిణ భారతాన సమతా నినాదంతో ఓ గొప్ప విప్లవం వెలుగు చూసింది. విశేషణం కోసం కాక వాస్తవ అర్థం కోసం దీనిని వీక్షించాలి. ఎందుకంటే ఆ సమతా విప్లవజ్యోతి ఇప్పటికీ దేదీప్యమానంగా వెలుగుతోంది. ఆ విప్లవదార్శనికుడు, సమతా వాది విశిష్ట ఆచార్యులు రామానుజాచార్యులు. ఆయన బోధించిన విశిష్టాద్వైతాన్ని భారతీయ కమ్యూనిజం అన్నాఅతిశయోక్తి అవదు. భక్తి, సామాజిక రంగాల్లో సమానత సాధించేందుకు పూనుకున్న ఆ మహానీయుని సహస్రాబ్ది ఉత్సనాలు వచ్చేనెల (ఫిబ్రవరి) రెండో తేదిన హైదరాబాద్ సమీపాన శంషాబాద్ వద్ద ముచ్చింతల్లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. 216 అడుగుల ఎత్తయిన భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ ప్రాంగణంలోనే ఉన్న దివ్య సాకేత మందిర సముదాయం కూడా లోకార్పణం కానున్నది.

సమతా పతాకాన్ని సమున్నతంగా ఎత్తిపెట్టినట్టు విశిష్టాద్వైత ఆచార్యుల మంగళరూపం ఎంతో స్ఫూర్తిదాయకంగా, భక్తిస్ఫోరకంగా చూపరులను ఆకర్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వంద కిలోమీటర్ల దూరంలో కొబ్బరి వనాలు దండిగా కనిపించే ఉండి ప్రాంతంలోని ఉప్పులూరు గ్రామంలో ఆ సమతా విప్లవ ఫలితాలను ప్రత్యక్షంగా నేటికీ వీక్షించవచ్చు. అక్కడి చెన్నకేశవ ఆలయ ప్రధాన అర్చకుడు, అతని సహాయకులు అస్పృశ్యులుగా భావించిన మాలలు. పాఠకులు ఈ అక్షరాలు చదువుతున్న సమయానికి ఆ మాల దాసరులు అక్కడ దోషరహితంగా సంస్కృతంలో స్తోత్రాలు, మంత్రాలు పఠిస్తుంటారు. ఆ గ్రామ బీసీలు, అగ్రవర్ణాల్లో ఇతరులు వారి నుంచి ఆశీర్వాదం అందుకుని వారు తయారు చేసిన ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని భక్తిగా అరగిస్తుంటారు. వారి పాదాలకు నమస్కరించి తాము ధన్యులమని తలపోస్తారు. ఇది కాదా విప్లవమంటే?

సమత కోసం ఢమరుకం

చతుర్విధ పురుషార్థాలు భూమికగా నెలకొన్న భారతీయ కమ్యూనిజాన్ని మరింత చిక్కబర్చేందుకు వైష్ణవ విప్లవం వెల్లువెత్తిన కాలులోనే అదే భావనతో, పిసరంత ఎక్కువ ఆవేశంతో ప్రజల సాధికారత, సమత కోసం ఢమరుకం మోగించింది వీరశైవం. భారతీయ కమ్యూనిజానికి మరింత వన్నె తెచ్చింది. కన్నడ దేశంలో (కర్ణాటకలో) రేణుకాచార్యులు, బనవన్నల ప్రభావం అపారం. ఆయన ప్రవచనాలు అజరామరం. తెలంగాణలో పూర్వపు నల్గొండ జిల్లాలో ఆలేరు సమీపంలోని కొలనుపాక గ్రామం కేంద్రంగా సమతా భావం, సర్వసత్తాక తలంపుతో ఆ వీరశైవం విరబూసింది. అక్కడి దళితులే కాదు మొత్తం 18 నిమ్నకులాలకు మఠాలు, మందిరాల నిర్మాణం జరిగింది. రేణుకాచార్యులు ఇక్కడివారేనని విశ్వసిస్తారు. ప్రజలెవ్వరూ ద్వితీయ శ్రేణి పౌరులు కాదన్న అవగాహనతో ఆయా కులాలకు చెందిన వారికే అర్చకత్వ బాధ్యతలు అప్పగించారు. అవసరమైన శిక్షణ ఇచ్చి అధ్యయనం చేయించారు. దాదాపు వెయ్యేళ్ళుగా ఆ పరంపర అక్కడ ఘనంగా కొనసాగుతోంది. ఇది కదా! భారతీయ కమ్యూనిజం అంటే. ఇది కదా స్వేచ్ఛ, స్వాతంత్య్రం అంటే, ఇది కదా ప్రజల వికాసానికి మార్గం వేయడమంటే. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కొలనుపాకలోని ప్రధాన సోమేశ్వరాలయ పూజారి బ్రాహ్మణేతరులు. శతాబ్దాలుగా ఆ సంప్రదాయం కొనసాగుతోంది. భారతీయ కమ్యూనిజం అక్కడ కొలువై ఉన్న వైనం ఆ దేవాలయంలో, దేవాలయ వ్యవస్థలో, ఆ దేవాలయ శిల్ప సంపదలో మనకు ద్యోతకమవుతుంది, తేటతెల్లమవుతుంది.

భారతీయ కమ్యూనిజం కథలు,గాథలు కోకొల్లలు. ఆ ధృతి, స్ఫూర్తి, శక్తి మరింత చిక్కబడేలా పూనుకోవడం కొత్త తరాల కర్తవ్యం కావాలని కోరుకోవడం అత్యాశేమీ కాదు. కాలానుగుణమైన చోదక శక్తిని జత చేసి భారతీయ కమ్యూనిజానికి జై కొట్టడంలోనే ఈ నేల పరిమళం జై మరింతమందిని మేల్కొలుపుతుంది.

చాపకూడుతో సమతా రుచులు

12వ శతాబ్దంలో పల్నాడు ప్రాంత నలగామరాజు కొలువులో మంత్రిగా పని చేసిన బ్రహ్మనాయుడు సమతావాది బోధనలకు ఆకర్షితుడై, పరవశుడై తనదైన శైలిలో చాపకూడు సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టారు. ఇదికదా భారతీయ భావుకత, క్షేత్రస్థాయిలో కమ్యూనిస్టుల ఆచరణ, భారతీయ కమ్యూనిజం గుబాళింపు? పల్నాడులో చెన్నకేశవ స్వామి ఆలయం ప్రమాదంలో పడినప్పుడు అక్కడి మూల విగ్రహాలను తన ప్రియశిష్యుడు మాల కన్నమదాసుకు ఇచ్చి అతడి నేతృత్వంలో కొందరిని తెలుగు నేల నలుచెరగులకూ పంపాడు. అలా వచ్చినవారి వారసులే ఉప్పులూరు దేవాలయ ప్రాంగణంలో తరతరాలుగా జీవిస్తూ స్వామికి సేవలందిస్తున్నారు. ఒక్క ఉప్పులూరులోనే కాదు ఇంకా అనేక చోట్ల ఇలాంటి అపురూప దృశ్యాలు కనిపిస్తాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం వీరికి, మరికొందరు దళితులకు అర్చకత్వంలో శిక్షణ ఇస్తోంది. కులం, వర్గం అన్న వ్యత్యాసం లేకుండా అందిస్తున్న ఈ జీవన విధానాన్ని కమ్యూనిజం కాదని ఎవరంటారు? శతాబ్దాలుగా కొనసాగుతున్న సమతా వీచికలు గొప్ప విప్లవ ఫలం కాక ఏమవుతుంది? చైతన్యవంతులు, మేధావులు, ఈ భారతీయ కమ్యూనిజాన్ని అవసరమైన మేరకు ఆధునీకరించి, ఉన్నతీకరించుకునే సౌలభ్యం ఉంది కదా? యూరప్ లో కారల్ మార్క్స్ దాదాపు 200 ఏళ్ళ క్రితం ప్రవచించిన కమ్యూనిం కన్నా ఈ నేలకు చెందిన ఈ కమ్యూనిజం శ్రేష్ఠమైనది కదా? చాపకూడు సిద్ధాంతం, సామాజిక న్యాయం అందరికీ అందుబాటులోకి తీసుకుని రావడం సమతా దర్శనం కాక మరి ఏమవుతుంది? దీనిని కాదని కాగితం పువ్వులాంటి మార్క్స్ కమ్యూనిజాన్ని భుజానికెత్తుకోవడం, సొంత ప్రజలను, వారిపిల్లాపాపల్నిఅదేపనిగా హతమార్చడం వల్ల ఒరిగేది ఏమిటి? గత వందేళ్ళుగా దేశంలో కొనసాగుతున్న వారి అరివీర భయంకర హింస ధ్వని, ధ్వంస రచన ఎవరికి మేలు కలిగిస్తోంది? ఆలోచనాపరులు దీనిపై వివేచన చేయాల్సిన సందర్భం ఆసన్నమైంది.

మునివాహన సేవ కన్న మిన్నయైనదున్నదా?

ముని వాహన సేవ పేర బ్రాహ్మణులు, దళిత భక్తుడిని భుజాలకెత్తుకుని ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకుని వెళ్ళడం కన్నా మించిన ఆదర్శం మరొకటి ఏముంటుంది? ఇది కాక సమతకు చిహ్నం మరేముంది? భారతీయ సమాజం కోరుకునేది ఇదే కదా? ఆహాన్ని అణచివేయడం వల్లే అడ్డుగోడల్ని కూల్చివేయవచ్చని చాటి చెప్పే ఈ ఉత్సవం విశ్వవ్యాప్తం కావల్సిన అవసరం ఉంది కదా ? దీన్ని కదా యువరక్తం ప్రోత్సహించి పట్టం కట్టాల్సింది? హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయం గుంటూరు, నెల్లూరు, తదితర నగరాలు… పట్టణాల్లోని దేవాలయాల్లో ఈ మునివాహన సేవ ఇప్పటికీ కొనసాగుతూ ఉండటం, అద్భుతం కదా? ఇది కదా కమ్యూనిజం, సోషలిజం సారం?మరి దీన్ని విస్మరించి పరాయి ప్రవచనాల వైపు పెరుగులు తీయడం భారతీయత ఏలా అనిపించుకుంటుంది? ఇంద్రియాలు, అరిషడ్వర్గాల ప్రభావంతో మనిషి మనుగడ, ప్రవర్తన ఆదారపడి ఉంటుంది. కానీ మార్క్స్ వీటిని పట్టించుకోలేదు. అసలు పరిగణనలోకి తీసుకోలేదు. దాంతో ఆ సిద్ధాంతమంతా నెత్తుటి వాసన వస్తోంది. భారతీయ కమ్యూనిజంలో ఇంద్రియాలనూ, అరిషడ్వర్గాలను అదుపు చేసే మార్మికత, సాంత్వన గొలిపే లేవనం ఉంది. తులనాత్మక అధ్యయనంతో దీన్ని ఎవరైనా తేల్చుకోవచ్చు. అవసరమైన రూపాంతరీకరణకు అవకాశం మెండుగా ఉంది.

వెయ్యేళ్ళనాడే వారు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.

మార్క్స్ కమ్యూనిజం పాషాణం. అందులో సంస్కరణకు అస్కారమే లేదు. రెండు వర్గాల మధ్య తంపులు పెట్టి, ద్వేషం ఎగదోసి ఘర్షణకు గాలి నింపి చోద్యం చూడటం తప్ప సహజత్వం, శక్తి సామర్థ్యాలు, జ్ఞానం, హెచ్చుతగ్గుల ఊసు కలికానికైనా కానరాదు. దళిత అర్చకులకు అమరకోశం, శబ్ద మంజరి, రఘువంశం బ్రాహ్మణులు బోధిస్తే ఎవరికి నష్టం? మరి ఎవరికి కష్టం? ఈ శాస్త్రాలు, అంశాలు సరిపడవనుకుంటే సరికొత్త పరిజ్ఞానాన్ని అనుబంధంగా అందించడానికి ఎవరు కాదంటారు? వ్యక్తి వికాసం, భాష, సభ్యత, సంస్కారంపై ఆధారపడుతుంది. దీన్ని వెయ్యేళ్ళుగా భారతీయ కమ్యూనిజం ఋజువు చేస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ దళిత రచయిత్రి నంబూరి పరిపూర్ణ జీవితం తెలియజేస్తోంది. ఆమె రచించిన తన జీవిత చరిత్ర దీనికి అద్దం పడుతోంది. ‘రామానుజాచార్యుల విశిష్టాద్వైతం బ్రాహ్మణులకే కాకుండా దళితులకూ, ఇతర నిమ్న వర్గాలకూ, వర్ణాలకూ చేరింది. దాంతో వెయ్యేళ్ళ క్రితమే – సమాజంలో విప్లవం చోటు చేసుకుంది. మా పూర్వీకులు దళితులు. వైష్ణవాన్ని అందిపుచ్చుకున్నారు. తర్వాత మేం బ్రాహ్మణులం అని సగర్వంగా చాటుకున్నారు. ఆ విధంగా మాలో సంస్కారం ఏర్పడింది. చదువు సంధ్యలు వంటబట్టాయి. సంగీత, సాహిత్య, నృత్య రంగాల్లో ప్రావీణ్యం సంపాదించారు. మా నాన్న హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి (స్త్రీ పాత్ర) పోషించి హృద్యంగా పద్యాలు పాడి రాష్ట్రం నలుమూలలా ప్రజలను మెప్పించారు. ఒప్పించారు. నేను సినిమాల్లో బాల నటిగా, వక్తగా, గాయనిగా, ఆకాశవాణి ప్రయోక్తగా సేవలందించాను. ఇదంతా విశిష్టాద్వైతం అందించిన చైతన్యం, స్పూర్తి వల్లనే సాధ్యమైంది. ఆ చైతన్యానికి దూరంగా ఉన్న వాళ్ళు మా కళ్ళ ముందే దశాబ్దాలుగా అలాగే ఉండిపోయారు. సరైన అవకాశాన్నీ, జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడే వ్యక్తి, సమూహం, అభివృద్ధి చెందుతుంది అని అంటారు. తమసోమా జ్యోతిర్గమయలా కాంతి పుంజాల్లాంటి మాటల సారాంశమే ఆమె జీవితం.

అయితే, ఆమె జీవితంలో కమ్యూనిస్టు నాయకుడు దాసరి నాగభూషణరావు భర్తగా ప్రవేశించారు. కమ్యూనిస్టు పార్టీ విధానాల ప్రకారమే వారి పెళ్ళి జరిగింది. అది ఆమె జీవితాన్ని కుదిపేసింది. అనంతరం ఆమె సుదీర్ఘకాలం అభద్రతా భావంతో తల్లడిల్లారు. అయినా నిశిష్టాద్వైతం అందించిన ప్రతిభను ఆసరాగా చేసుకుని బలంగా నిలదొక్కుకున్నారు. కారల్ మార్క్స్, కమ్యూనిజంతో ప్రేరేపితులైన వారిలో కుటుంబ విలువలు, క్రమశిక్షణ, లౌక్యంతో ద్వంద్వ ప్రమాణాలను పాటించడం గమనించవచ్చు. అలాగే, భారతీయ కమ్యూనిజం – సంస్కృతిని ఆవాహన చేసుకున్న వారిలో విలువలు, క్రమశిక్షణ కుటుంబ అభివృద్ధికి త్యాగం ఎంతో తేజోమయమన్న సంగతిని దర్శించవచ్చు. ప్రధానంగా విప్లవమంటే రాజ్యాధికారయావ కాదు. ముళ్ళ కిరీటం అసలే కాదు. విప్లవమంటే సాంత్వన చిక్క బడటం సాధికారత చెదిరి పోకుండా ఉండటం అన్న విషయం తులనాత్మక, శాస్త్రీయ పరిశీలనలో దర్శనమవుతుంది.

– ఉప్పల నరసింహం

– ఆంధ్ర ప్రభ సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.