News

ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఇక లేరు

563views

భాగ్య‌న‌గ‌రం: ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి హఠాన్మరణం చెందారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వచ్చిన గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయాసంతో ఉన్న ములుగు సిద్ధాంతిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ములుగు సిద్ధాంతి ఆకస్మిక మరణం పట్ల జ్యోతిషవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

30 ఏళ్లుగా విశేష సేవలు

ములుగు సిద్ధాంతిగా పేరొందిన రామలింగేశ్వర సిద్ధాంతి 30 ఏళ్ళులుగా జ్యోతిషులుగా విశేష సేవలందించారు. రాశిఫలాలతో పాటు, ఆయన చెప్పే జ్యోతిషాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం విశ్వసిస్తుంటారు. ఎన్నికలు, ప్రకృతి విపత్తులు.. ఇలా పలు అంశాలపై ఆయన ఎప్పటికప్పుడు తన అంచనాలను వెలువరించేవారు. ఆయన మృతిపట్ల జ్యోతిషవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ములుగు సిద్ధాంతి గారి అంత్యక్రియలు సోమవారం సాయంత్రం 5:30 గంటలకు మలక్‌పేట్ రేసుకోర్సు సమీపంలోని హిందూ శ్మ‌శాన వాటికలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతిష పండితుడిగా…

శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతిష పండితుడిగా, శ్రీశైలం పీఠాధిపతిగా ములుగు సిద్ధాంతి సేవలందించారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా జ్యోతిషంలో సేవలందించిన ఆయన గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించడానికి ముందు ఆయన ఎంఆర్‌ ప్రసాద్‌ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా గుర్తింపు పొందారు. సినీ నటులు ఏవీఎస్‌, బ్రహ్మానందం తదితర కళాకారులతో ప్రదర్శనలు ఇచ్చారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి