
-
ప్రపంచ శాంతి, కరోనా నివారణార్థం రేపటి నుండి 27వ తేదీ వరకు ఉత్సవం
తిరుచానూరు: ప్రపంచ శాంతి, సౌభాగ్యం, కరోనా నివారణార్థం లోకమాత శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ నెల 21 నుండి 27వ తేదీ వరకు ఏడు రోజుల పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీయాగం నిర్వహించనున్నారు.
కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో ఏకాంతంగా ఈ యాగం జరుగనుంది. అర్చకుడు పి.శ్రీనివాసన్ ఈ యాగానికి ప్రధానాచార్యులుగా వ్యవహరిస్తారు. ఈ రోజు సాయంత్రం అయిదున్నర నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు.
21న మొదటిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు యాగశాల హోమాలు, చతుష్టానార్చన, అగ్ని ప్రతిష్ఠ, నిత్యపూర్ణాహుతి, నివేదన, వేద విన్నపం, మహా మంగళహారతి నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు చతుష్టానార్చన, శ్రీయాగం హోమాలు, లఘుపూర్ణాహుతి, మహానివేదన, వేద విన్నపం, మహా మంగళహారతి చేపట్టి అమ్మవారి ఉత్సవర్లను సన్నిధిలోకి వేంచేపు చేస్తారు. 22 నుండి 26వ తేదీ వరకు ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం అయిదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు శ్రీయాగం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
చివరిరోజు 27న ఉదయం ఆరున్నర నుండి ఎనిమిదిన్నర గంటల వరకు చతుష్టానార్చన, హోమాలు, మహాప్రాయశ్చిత్త హోమం, మహాశాంతి హోమం నిర్వహిస్తారు. ఉదయం ఎనిమిదిన్నర నుండి తొమ్మిది గంటల వరకు మహాపూర్ణాహుతి చేపడతారు. ఉదయం తొమ్మిది నుండి 10.30 గంటల వరకు అభిషేకం, అవభృతం నిర్వహిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
శ్రీయాగం కారణంగా నేటి నుంచి 27వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను టీటీడీ రద్దు చేసింది. జనవరి 20, 21, 27వ తేదీల్లో బ్రేక్ దర్శనం రద్దు చేశారు.





