
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. భారతీయ నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విశాఖపట్టణం యుద్ధ నౌక నుంచి ఆ క్షిపణిని పరీక్షించారు. పశ్చిమ తీరంలో ఈ పరీక్షను చేపట్టారు. సముద్రం నుంచి సముద్రంపైనున్న లక్ష్యాలను చేధించే మిస్సైల్ ను పరీక్షించారు. ప్రయోగించిన క్షిపణి లక్ష్యానికి తగ్గట్టుగా ప్రయాణించి.. లక్ష్యంగా నిర్దేశించిన నౌకను పేల్చినట్లు భారతీయ నౌకాదళ వర్గాలు వెల్లడించాయి.
బ్రహ్మోస్ క్షిపణి, నిర్దేశిత లక్ష్యాన్ని “ఖచ్చితంగా” ఛేదించిందని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) తెలిపింది. “క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం భారత నావికాదళం యొక్క శక్తిని ప్రపంచానికి చాటింది.” అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారత నౌకాదళ ఉద్యోగులు అద్భుతమైన టీమ్ వర్క్ ను ప్రదర్శించారని రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.