
-
పోలీసులకు రూ. 22 లక్షల బహుమానం ప్రకటించిన హిందూ సంఘాలు
గురుగ్రామ్: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేసిన వారికి రూ.22 లక్షలు ఇస్తామని గురుగ్రామ్‌లో హిందూ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. హిందూ ధర్మకర్త కాళీచరణ్ మహరాజ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, పలు హిందూ సంస్థల సభ్యులు నిరసన ప్రదర్శన చేశారు. ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. అసదుద్దీన్ ఒవైసీని అరెస్ట్ చేసిన పోలీసు అధికారికి రూ. 22 లక్షల నగదు బహుమతిని కూడా వారు ప్రకటించారు.
గాంధీని కించపరిచే వ్యాఖ్యల్ని చేసినందుకు గత నెల 30న అరెస్టు చేసిన కాళీచరణ్ మహారాజ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 22 సంఘాలకు చెందిన కార్యకర్తలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. గురుగ్రామ్‌లోని సివిల్ లైన్స్ వద్ద డిప్యూటీ కమిషనర్ ఇంటి నుంచి ఆయన కార్యాలయం వరకూ పాదయాత్ర సాగింది. అధికారులకు వినతి పత్రాలను కూడా అందించారు.
“ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఉంది. సంత్ కాళీచరణ్ అరెస్టు వెనుక కుట్ర ఉంది. ఒవైసీని పోలీసులు, ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయలేదు? ఒవైసీని పట్టుకున్న పోలీసు అధికారికి రూ. 22 లక్షలు ఇస్తాం’’ అని నిరసన ప్రదర్శనకు నేతృత్వం వహించిన హిందూ నాయకుడు, న్యాయవాది కులభూషణ్ భరద్వాజ్ అన్నారు. ఇటీవల, ఒవైసీ ప్రసంగానికి సంబంధించిన తేదీ లేని వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. హైదరాబాద్ ఎంపీ ప్రసంగం సందర్భంగా హిందువులను బెదిరింపులకు గురిచేశారని పలు హిందూ సంఘాల కార్యకర్తలు ఆరోపించారు.
‘‘మర్చిపోకండి యూపీ పోలీసుల్లారా..! మీ ఆటలు సాగేది కొన్నాళ్లే..!! యోగి ఎల్లకాలం సీఎంగా వుండడు. ప్రధాని మోదీ ఎల్లకాలం పీఎంగా ఉండలేడు. ముస్లింలమైన మేం కొన్ని పరిస్థితుల వల్ల మౌనంగా వుంటున్నాం. కానీ, గుర్తుంచుకోండి.. మాకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోం. అల్లా తన శక్తితో మిమ్మల్ని నాశనం చేస్తాడు. కాలం మారుతుంది. మాకూ టైమొస్తుంది. గుర్తుంచుకోండి ఒక్కసారి ముస్లిం ప్రభుత్వం ఏర్పడిందంటే.. మీ యోగి మఠానికి వెళ్లిపోతాడు. మీ మోదీ హిమాలయాలకు వెళ్లి దాక్కుంటాడు. అప్పుడు మిమ్మల్ని రక్షించడానికి ఎవడొస్తాడో చూస్తా’’ అంటూ ఒవైసీ మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే..! అలాంటి వ్యక్తిపై చర్యలు ఎందుకు తీసుకోరో చెప్పండని పలువురు హిందూ సంఘాల నేతలు ప్రశ్నించారు.
Source: NationalistHub





