
విజయవాడ: న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకుంటున్నారని వ్యాఖ్యానించడం ఇటీవల కాలంలో పెరిగిందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ఇది ఒక పెద్ద అపోహని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో కేంద్ర న్యాయశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు, హైకోర్టు కొలీజియంలు, ఐబీ, అత్యున్నత స్థాయి కార్య నిర్వాహక వ్యవస్థ కలిసి ఓ అభ్యర్థి యోగ్యతలను పరిశీలిస్తాయని తెలిపారు.
దీని గురించి బాగా తెలిసినవారూ దుష్ప్రచారం చేయడం తనను బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారాలు కొన్ని శక్తులకు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని పేర్కొన్నారు. విజయవాడలోని సిద్ధార్థ న్యాయ కళాశాలలో ఆదివారం జరిగిన లావు వెంకటేశ్వర్లు అయిదో స్మారక ఉపన్యాస సభకు జస్టిస్ ఎన్.వి.రమణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ‘భారత న్యాయ వ్యవస్థ – భవిష్యత్తు సవాళ్లు’ అన్న అంశంపై ప్రసంగించారు.





