
-
స్వయం సేవకులకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ దిశానిర్దేశం
పాలకొల్లు: ప్రజల కోసం జీవితాన్ని ధారబోసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకుని, దేశాన్ని విశ్వ గురు స్థానంలో నిలబెట్టడానికి కృషి చేద్దామని రాష్ట్రీయ స్వయం సేవక్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ స్వయం సేవకులకు దిశానిర్దేశం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం నిర్వహించిన ‘ఉభయగోదావరి జిల్లాల తరుణ సాంఘిక్ గోదావరి సంగమం’ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ‘స్వయం సేవకులు అందరి సుఖ దుఖాలను పాలుపంచుకుంటూ జీవించాలి. ప్రతి ఒక్కరూ కలిసి పనిచేసే గుణాన్నిఅలవరచుకోవాలి. కులాలకు అతీతంగా దేశ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత స్వయంసేవకులపై ఉందన్నారు. దేశ ఔన్యత్నాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత’ అని గుర్తు చేశారు.


-
ఎవరినీ హిందూ మతంలోకి మార్చాల్సిన అవసరం లేదు
‘హిందూ ధర్మంలో సత్యం ఉంది. శత్రుత్వం లేదు. ఇతర ధర్మాలను నాశనం చేయాలనే ఆలోచన అస్సలే లేదు. ఎవరి ధర్మం వారిది. ఎవరినీ హిందువులుగా మార్చా ల్సిన అవసరం లేదు’ అని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ‘దేశంలో మత మార్పిడికి కుట్ర జరుగుతోంది. దీన్ని తిప్పికొట్టాలి. ప్రలోభాలు, అసత్య ప్రచారాలూ నమ్మి ఇతర మతాలవైపు వెళ్తున్న హిందువులకు మాత్రం సనాతన ధర్మ గొప్పదనాన్ని వివరించండి. హిందూ ధర్మంలోని లోటుపాట్లను సరిచేసుకుంటూ, ధర్మ పరిరక్షులను సంఘటితం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం. స్వధర్మ రక్షణకు హిందువులంతా ప్రత్యేకంగా సమయాన్ని వెచ్చించాలి’ అని భాగవత్ పిలుపునిచ్చారు. సదస్సులో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, నాగార్జున కస్ట్రక్షన్స్ సంస్థ అధినేత ఏఎస్ఎన్ రాజు, ఆర్ఎస్ఎస్ భీమవరం విభాగ సంఘ్ చాలక్ మంతెన రామకృష్ణంరాజు, రాజమండ్రి విభాగ సంఘ్ చాలక్ ఆర్.సుబ్బరాజు పాల్గొన్నారు.
Rashatriya Swayamsevak Sangh
'Godavari Sangamam' programme organised at Palakole in West Godavari district.
Sarsanghchalak Ji appealed to the people to take a pledge for propagation & protection of Hindu culture & values, besides protecting and respecting the dignity of women. pic.twitter.com/3G95zLwEB6
— VSK BHARAT (@editorvskbharat) December 27, 2021
-
మైదానమంతా ఏకరూపమే
తెల్లరంగు పొడుగు చేతుల చొక్కా, ఖాకీ రంగు ప్యాంటు, నెత్తిన నల్ల టోపీ ధరించి, ఇన్‌షర్ట్ చేసుకున్న స్వయం సేవకులనే సభా ప్రాంగణంలోకి అనుమతించారు. సదస్సుకు మహిళలు, వృద్ధులతోపాటు పలువురు దివ్యాంగులు హాజరయ్యారు. భద్రతా కార ణాలతో వీఐపీల వాహనాలనూ ప్రధాన గేటు దగ్గర నిలిపేయడంతో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తదితరులు ఆర కిలో మీటరు దూరంలోని సభాస్థలికి కాలినడకనే వెళ్లారు.
-
ఈనాడు సౌజన్యంతో…





