News

పర్యావరణ పరిరక్షణతోనే దైవత్వం సాకారం

4views

పాలకొండ: సనాతన ధర్మంలో ప్రకృతి ఆరాధనకు విశిష్ట స్థానం ఉందని, పర్యావరణ పరిరక్షణ ద్వారా నిజమైన దైవత్వాన్ని అనుభవించవచ్చని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాపాలకొండలోని శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న “శ్రీ వనదుర్గ (బంతి–చామంతి) మహోత్సవం”ను స్థానిక శాసనసభ్యుడు నిమ్మక జయకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణంలో బంతి, చామంతి తదితర పుష్ప మొక్కల మధ్య అమ్మవారిని నవదుర్గ స్వరూపంగా ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా ప్రకృతిని ఆరాధించే భారతీయ సంస్కృతిని మరింత బలోపేతం చేయడమే ఈ మహోత్సవం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్న ఆయన, చెట్లు, మొక్కలను నాటి సంరక్షించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు. ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములైనప్పుడే నిజమైన దైవత్వాన్ని అనుభవించగలమని అన్నారు.

ఈ మహోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా అమ్మవారికి పూజించిన బంతి, చామంతి మొక్కలను భక్తులకు తీర్థప్రసాదంగా అందజేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు.

ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు ఒక మొక్క లేదా ఒక నారును తీసుకువచ్చి ఈ మహోత్సవంలో భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షిస్తే పచ్చదనంతో కూడిన ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ శ్రీ కోటదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

మొక్కల పెంపకంతో ఆరోగ్యకరమైన వాతావరణం
పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ, బంతి, చామంతి మొక్కలను ఇంటి పరిసరాల్లో పెంచడం వల్ల పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు దోమల నివారణకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల ఇరువైపులా విస్తృతంగా మొక్కలు నాటడం ద్వారా ఉష్ణోగ్రతలు తగ్గి, స్వచ్ఛమైన గాలి లభిస్తుందని, పర్యావరణ సమతుల్యత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

జిల్లా యంత్రాంగం, దేవస్థాన పరిపాలన సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ విశిష్ట కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందడంతో పాటు పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి వి.వి. సూర్యనారాయణ కోరారు. వనదుర్గ మహోత్సవాన్ని విజయవంతం చేసి, ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని జిల్లా యంత్రాంగం పిలుపునిచ్చింది.