
న్యూఢిల్లీ: తమిళనాడులోని కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో భారత రక్షణ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణించారు. మిలిటరీ హెలికాప్టర్ కూలి 13 మంది మృతి చెందగా.. ఓ వ్యక్తి తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ హెలీకాప్టర్‌లో ప్రయాణిస్తున్న జనరల్ రావత్ భార్య కూడా మరణించారు. ఈ విమాన ప్రమాదంలో విమానంలో ఉన్న జనరల్ బిపిన్ రావత్, మధులికా రావత్, మరో 11 మంది వ్యక్తులు మరణించారని నిర్ధారించినట్టు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ట్వీట్ చేసింది.
జనరల్ రావత్‌తో కూడిన ఎంఐ-17 వి5 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూర్ సమీపంలో ప్రమాదానికి గురైందని మధ్యాహ్నం రెండు గంటలకు ఐఏఎఫ్ ధ్రువీకరించింది. ఏం జరిగిందనే దానిపై విచారణకు ఆదేశించినట్లు వైమానిక దళం కూడా తెలిపింది. కోయంబత్తూరులోని సూలూర్‌లోని ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి ఉదయం 11.45 గంటలకు నీలగిరి కొండల్లోని వెల్లింగ్‌టన్‌కు హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీకి ఆ విమానం బయలుదేరింది. మరో 10 నిమిషాలలో ల్యాండ్ అయ్యే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికార వర్గాలు తెలిపాయి.
Source: NationalistHub





