
-
నంద్యాలలో ఘనంగా కార్తీకమాసం ఉత్సవాలు
-
ఉత్తమ సేవకులు, డాక్టర్లకు ఘన సత్కారం

నంద్యాల: పవిత్ర కార్తీకమాసం సందర్భంగా నంద్యాల ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో శివకేశవులను స్మరించుకుంటూ ఘనంగా భజన పోటీలు జరిగాయి. సనాతన ధర్మం మార్గదర్శనం చేసిన షోడశోపచారాలలో చాలా ఉపచారాలను కలిగి ఉన్న భజన ప్రక్రియ(శ్రవణం, మననం, కీర్తనం, నృత్యం…. మొదలగునవి.) ప్రధానమైనది. యోగ శాస్త్రానుసారం శరీరంలోని అంతర్గత ప్రధాన భాగాలను ఉత్తేజితం చేస్తుందీ భజన కార్యక్రమం. పాశ్చాత్య సాంస్కృతిక దాడిలో మరుగున పడి పోతున్న భజన ప్రక్రియకు ప్రాచుర్యం కల్పించేందుకు సంకల్పించింది నంద్యాల ధర్మ జాగరణ సమితి. ఇందులో భాగంగానే భజన పోటీలను నిర్వహించింది. నవంబరు 29 సోమవారం రోజున ముగింపు కార్యక్రమం జరిపింది. ప్రాంత ధర్మ జాగరణ సమితి ప్రముఖ్ తిరుపతయ్య ప్రధాన వక్తగా పాల్గొన్నారు.

పోటీల వివరాలు
నాలుగు వారాలుగా జరిగిన ఈ పోటీల్లో నంద్యాల, పరిసర ప్రాంతాలకు చెందిన 45 బృందాలు పాల్గొన్నాయి. ప్రథమ బహుమతి గోవింద పల్లె భజన బృందం కైవసం చేసుకుంది. ఈ బృందానికి రూ.లు 20,000 విలువచేసే హార్మోనియం బహూకరించారు. ద్వితీయ బహుమతి రామాపురం గెలుచుకోగా, రూ. 12,000 విలువ చేసే తబల ప్రదానం చేశారు. అలాగే తృతీయ బహుమతి జూనుంతల భజన బృందం పొందగా, వీరికి రూ. 3,500 డోలక్ అందజేశారు. ఇక, నాలుగు, అయిదు స్థానాలకు డి.కొట్టాల, శ్రీ రంగాపురం భజన బృందాలు ఎంపికయ్యాయి. కాగా, ఈ పోటీల్లో పాల్గొన్న బృందాలన్నింటికీ తాళాలు, డక్కీ బహూకరించారు. భజన కార్యక్రమంలో పాల్గొన్న మాతృమూర్తులకు సంప్రదాయానుసారం రవిక, గాజులు, పసుపు, కుంకుమ తాంబూలాలతో నిర్వాహకులు సత్కరించారు.

సేవకులకు సన్మానం
వివిధ రంగాల్లో కొన్నేళ్ళుగా సేవ చేస్తున్న ఉత్తమ సేవకులను ఎంపిక చేసి, ఘనంగా సత్కరించారు. పర్యావరణ పరిరక్షణ విభాగంలో గ్రీన్ సొసైటీ తరుఫున వెంకటేశ్వర్లు, ఆధ్యాత్మికత విభాగంలో ప్రహ్లాద స్వామి, వేణు గోపాల్ స్వామిలను ఎంపికయ్యారు. వీరు దేవాలయం కేంద్రంగా రామాయణం, మహాభారత ఇతిహాసాల పారాయణ, భజన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలాగే హార్మోనియం నేర్పించుట వంటి ధర్మ జాగరణ కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఇక గోసేవ విభాగంలో డాక్టర్ సకారామ్‌ను సత్కరించారు. వీరు గోమాతలు ఎక్కడ ఆపదలో ఉన్నా సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకొని సేవలు అందిస్తుంటారు. అలాగే కరోనా సమయంలో ఉత్తమ సేవలందించిన వైద్యులు డాక్టర్ బండారు నాగేశ్వరరావు, డాక్టర్ యశోదర, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శ్రీదేవి, పోలీసు, శానిటరీ సిబ్బందిని సన్మానించారు.
ఈ బృహత్తర కార్యక్రమ విజయానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషి చేసిన వారందరికీ ధర్మజాగరణ సమితి తరుఫున కర్నూల్ విభాగ్ ప్రముఖ్ శ్రీ రాంప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యోగా గురువు దామోదర్ రెడ్డి, రామాలయం అధ్యక్షుడు సుధాకర్, డాక్టర్ విష్ణువర్దన్ రెడ్డి, రాయలసీమ ఆర్తో హాస్పిటల్ డాక్టర్ జి.రామకృష్ణ రెడ్డి, డాక్టర్ నేట్ల మహేశ్వర్ రెడ్డి, విభాగ్ ధర్మ జాగరణ ప్రముఖ్ రాం ప్రసాద్, జిల్లా ధర్మ జాగరణ ప్రముఖ్ చంద్రశేఖర్ ప్రసాద్, చంద్రశేఖర్ రెడ్డి, నగర ధర్మ జాగరణ ప్రముఖ్ చింతలపల్లె వాసు, తదితరులు పాల్గొన్నారు.





