
మోన్: నాగాలాండ్‌లో దారుణం జరిగింది. మోన్ జిల్లాలో ఉగ్రవాదులనుకొని భద్రతా బలగాలు సాధారణ పౌరులపై కాల్పులు జరిపారు. 14మంది సాధారణ పౌరులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ప్రజలు ఆగ్రహంతో భద్రతాబలగాల వాహనాలను తగలబెట్టారు. మోన్ జిల్లా తిరు గ్రామానికి సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.
అంతకుముందు నాగాలాండ్‌లో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై దాడి చేశారు. మోన్ జిల్లా ఓటింగ్ వద్ద జరిగిన ఈ ఘటనలో పలువురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భద్రతా దళాలు సైతం కాల్పులకు తెగబడ్డారు. అయితే, అదే సమయంలో అటుగా వస్తున్న కూలీల వాహనం చూసి ఉగ్రవాదులుగా భావించి కాల్పులు జరిపారు జవాన్లు. కూలీల బృందం తిరు గ్రామం నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
మృతుల్లో చాలా మంది బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులుగా గుర్తించారు. శనివారం సాయంత్రం పనులు ముగించుకొని ఇళ్లకు వస్తున్న సమయంలో భద్రతాదళాలు కాల్పులు జరిపారని స్థానికులు తెలిపారు. ఇదిలావుంటే, మృతుల సంఖ్యపై కొంత గందరగోళం నెలకొంది. ఆరుగురు చనిపోయారని అధికారులు చెబుతుంటే.. మొత్తం 14 మందిని చంపేశారని స్థానికులు చెబుతున్నారు.
Source: Tv9





