
న్యూఢిల్లీ: భారత్‌లో నాణ్యమైన వైద్యసేవలు చౌకగా లభిస్తుండటంతో పాశ్చాత్యుల్లో అనేక మంది భారత్ బాట పడుతుంటారు. దీన్నే మెడికల్ టూరిజం అని అంటారు. విదేశీయులు అత్యధికంగా ఎంచుకునే గమ్యస్థానాల్లో భారత్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని ప్రముఖ ఎస్‌ఎమ్ఎస్ ఆస్పత్రి వైద్యులు అరుదైన రికార్డు సృష్టించారు.
అమెరికాలో దాదాపు కోటిన్నర రూపాయల ఖర్చయ్యే ఆపరేషన్‌ను కేవలం లక్షన్నరలోనే పూర్తి చేసి, అమెరికా యువతికి స్వాంతన చేకూర్చారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన యువతి అనువంశిక కారణాల రీత్యా నాలుగు అడుగులకు మించి ఎత్తు పెరగలేదు. దీంతో ఆపరేషన్ ద్వారా కాలి ఎముకల పొడవును పెంచితేనే ఎత్తు పెరిగే అవకాశం ఉంది. అయితే.. అమెరికాలో ఈ ఆపరేషన్‌కు దాదాపు కోటిన్నర ఖర్చవుతుంది.
ఈ క్రమంలో ఆమె తన శస్త్రచికిత్స కోసం భారత్‌లోని ఎస్‌ఎమ్ఎస్ ఆస్పత్రిని ఎంచుకుంది. దీంతో.. బుధవారం వైద్యులు ఆమెకు ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేశారు. మెకాళ్ల కింది ఎముకల్లో రాడ్లను ఏర్పరిచి వాటి పొడవును ఎనిమిది సెంటీమీటర్ల మేర పెంచగలిగారు.





