News

భామినిలో కంప్యూటర్‌ కోర్సు సర్టిఫికేట్ల ప్రదానోత్సవం

566views

భామిని: గ్రామీణ వికాస్‌ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా భామిని మండలం, ఘనసర గ్రామంలో కంప్యూటర్‌ కోర్సు సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌లో ఉచితంగా కోర్సు అందిస్తున్నారు. మొదటి లాక్‌ డౌన్‌ తరువాత నుండి ఇప్పటి వరకు సుమారు 2సం.లలో ఆరు గ్రామాల నుండి 150 మంది హై స్కూల్‌ విద్యార్థులు కంప్యూటర్‌ బేసిక్‌ కోర్సును నేర్చుకున్నారు. కాని కరోనా నియమాల వలన సెంట‌ర్ వారు సర్టిఫికేట్లను అందజేయలేకపోయారు. దీంతో ఈ నెల 21న విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. స్థానిక మండల విద్యా శాఖా అధికారి శ్రీనివాసరావు చేతుల మీదుగా సంస్థ ద్వారా సర్టిఫికెట్లు ప్రదానం జరిగింది.

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ వికాస్‌ సంఘం అంటే గ్రామీణ ప్రాంతాలను వికసింప చేయడం అని, సంస్థ గ్రామీణ ప్రాంతాలను విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో అభివృద్ధి కొరకు చాలా ఉపయోగకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది అని తెలిపారు. అందులో భాగంగా గ్రామీణ విద్యార్థుల కొరకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ ఇవ్వడం చాలా గొప్పవిషయం అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి డాక్టరు మజ్జి ఈశ్వరరావు పాల్గొని సంఘ కార్యక్రమాలు విస్తృతం విజయవంతం చేయడానికి గ్రామస్తుల భాగస్వామ్యం మరింత కావాలని కోరారు. గ్రామ సర్పంచ్‌ కిల్లరి ఫాల్గుణ రావు, మాజీ ఎంపీపీ భూపతి ఆనంద రావు, ప్రముఖ వ్యాపారవేత్త గుడ్ల సత్యరావు, తల్లిదండ్రులు, సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఒక విద్యార్థిని మాట్లాడుతూ మండల కేంద్రంకు వెళ్లలేని మాకు దగ్గరలో గ్రామీణ వికాస్‌ సంఘం ఈ ఉచిత కంప్యూటర్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వలన మేము కోర్సును నేర్చుకోగలిగాము. లేకపోతే మేము నేర్చుకునే అవకాశమే లేదు అని అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి