
-
ఆంధ్రాలో మూడు జిల్లాలకు కలగనున్న సౌకర్యం
న్యూఢిల్లీ: తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ సేవలు లేని గ్రామాలకు 4జీ సేవలు అందించడానికి కేంద్రం సన్నద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో 1,218 గ్రామాలు సహా దేశవ్యాప్తంగా 44 ఆకాంక్ష(యాస్పిరేషనల్) జిల్లాల్లోని 7,287 గ్రామాలకు 4జీ సేవలు అందించడంలో భాగంగా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్‌ఓఎఫ్) పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలు బుధవారం సమావేశమయ్యాయి. అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. దేశంలోని ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశాల్లోని దాదాపు 44 జిల్లాల్లో ఇప్పటివరకూ సెల్ సౌకర్యం అందుబాటులో లేని గ్రామాలను గుర్తించారు.
విశాఖ జిల్లాలో 1,054, విజయనగరంలో 154, కడప జిల్లాలో 10 గ్రామాల్లో మొబైల్ సేవల విస్తరణకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు. మొత్తంగా 18 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. సాధ్యసాధ్యాలు పరిగణనలోకి తీసుకొని పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత ఎక్కువగా సోలర్ పవర్ బ్యాటరీలు ద్వారా టెలికాం టవర్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు.





