
పూణే: ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, పద్మవిభూషణ్ బాబాసాహెబ్ పురందరే కన్నుమూశారు. ఆయన వయసు 99 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా రెండు రోజుల క్రితం పూణెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్ సాయంతో ఉన్నఆయన తెల్లవారుజామున అయిదుగు గంటల ప్రాంతంలో మరణించారని ఆసుపత్రి వర్గాలు వెల్లడిరచాయి. బాబాసాహెబ్‌కు ప్రభుత్వపరంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.
ప్రధాని సంతాపం
పురందరే మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నాకు చెప్పలేనంత బాధ కలిగింది. శివషాహీర్ బాబాసాహెబ్ పురందరే మరణం చరిత్ర, సాంస్కృతిక ప్రపంచంలో ఒక పెద్ద శూన్యతను మిగిల్చింది. రాబోయే తరాలు ఛత్రపతి శివాజీ మహారాజ్‌తో మరింత కనెక్ట్ అయ్యేలా చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు.. అని అన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్‌చాలక్ సంతాపం
పద్మవిభూషణ్ బాబాసాహెబ్ పురందరే మృతి పట్ల ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ సంతాపం తెలిపారు. ఆయనొక మంచి కవి, దేశభక్తి కలిగిన వారు అని ఆయన అన్నారు.






