News

దిల్లీ రీజినల్‌ సెక్యూరిటీ డైలాగ్‌ సదస్సుకు చైనా డుమ్మా!

546views

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ బాటలోనే చైనా నడిచింది. అఫ్గనిస్థాన్‌ పరిణామాలపై భారత ప్రభుత్వం నిర్వహించనున్న ‘దిల్లీ రీజినల్‌ సెక్యూరిటీ డైలాగ్‌’ సదస్సుకు హాజరుకాలేమంటూ చైనా డుమ్మాకొట్టింది. ఈ నెల పదోతేదీ బుధవారం దిల్లీ వేదికగా జరిగే ఈ కీలక సదస్సుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ అధ్యక్షత వహించనున్నారు. తాలిబన్ల పాలనలో మగ్గిపోతున్న అఫ్గాన్‌ పరిణామాలపై ఈ కార్యక్రమంలో చర్చించనున్నారు. ఇందుకోసం పాక్‌, చైనాతో పాటు రష్యా, ఇరాన్‌, కిర్గిజిస్తాన్‌, తజకిస్తాన్‌, తుర్క్‌మెనిస్తాన్‌, కజకిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌ తదితర దక్షిణాసియా దేశాలన్నింటికీ భారత ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. చాలా దేశాలు సానుకూలంగా స్పందించి సదస్సుకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. అయితే, భారత్‌ విషయంలో మొదటి నుంచి ఒకే వైఖరి అవలంబిస్తున్న పాక్‌, చైనా దేశాలు మాత్రం ఈ సదస్సుకు రాలేమని ప్రకటించాయి.

శాంతి భద్రతల పునరుద్ధరణే లక్ష్యంగా..

ఈ ఏడాది ఆగస్టులో తాలిబన్లు అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆ దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. శాంతి భద్రతలు క్షీణించాయి. ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. అయితే, తాలిబన్లతో అఫ్గాన్‌కే కాదు దక్షిణాసియా దేశాల శాంతికి విఘాతం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై చర్చించేందుకే భారత ప్రభుత్వం దక్షిణాసియా దేశాలతో ‘దిల్లీ రీజినల్‌ సెక్యూరిటీ డైలాగ్‌’ సదస్సును ఏర్పాటుచేసింది. అఫ్గాన్‌లో శాంతి భద్రతల పునరద్ధరణే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించనున్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. అదేవిధంగా ఉగ్రవాదం, రాడికలైజేషన్‌, మాదక ద్రవ్యాల సరఫరా, దేశ సరిహద్దుల్లో ప్రజల కదలికలు, అమెరికా వదిలిపెట్టిన సైనికాయుధాలు మొదలగు అంశాలు చర్చకు రానున్నాయి.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి