
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల వెంబడి నిర్దిష్ట ప్రాంతాల్లో రోడ్డు, నడక మార్గాలను నిర్మించడానికి తన ప్రత్యేక ఇంజినీరింగ్ విభాగాన్ని వినియోగించాలని భారత్- టిబెట్ సరిహద్దు పోలీసు దళం(ఐటీబీపీ) తొలిసారిగా నిర్ణయించింది. తద్వారా లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లలోని తన శిబిరాలకు చేరుకునేందుకు ఉద్దేశించిన అనుసంధాన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. 32 రోడ్లకుగా నాలుగింటిని, 18 నడక మార్గాల్లో రెండింటిని నిర్మించే బాధ్యతను ఐటీబీపీ చేపట్టిందని అధికారులు తెలిపారు.
లద్దాఖ్ ప్రాంతంలో ఎల్‌ఏసీ వెంబడి ఉన్న రోడ్లలో ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల పొడవైన మార్గాల బాధ్యతను తీసుకున్నట్టు పేర్కొన్నారు. నడక మార్గాలు అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఉన్నాయని వివరించారు. పదాతి దళాల గస్తీకి వీటిని ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. సాధారణంగా ఈ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ బాధ్యతలను సరిహద్దు రోడ్ల సంస్థ, కేంద్ర ప్రజా పనుల విభాగం చేపడుతుంటాయి. అయితే, వీటిని వేగవంతం చేసే ఉద్దేశంతోనే తమ ఇంజినీరింగ్ విభాగాన్ని రంగంలోకి దించినట్టు ఐటీబీపీ అధికారులు పేర్కొన్నారు.





