
హెరాయిన్ అక్రమ రవాణా నేరంపై ప్రవాస భారతీయుడు నాగేంద్రన్ కు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలని అంతర్జాతీయ సమాజం చేస్తున్న డిమాండుపై సింగపూర్ ప్రభుత్వం ప్రతికూలంగా స్పందించింది.
మాదకద్రవ్యాల రవాణా నేరం అని తెలిసీ చేశాడని సింగపూర్ ప్రభుత్వం తెలిపింది. మలేసియాలో స్థిరపడ్డ నాగేంద్రన్ కె ధర్మలింగం(33) ఈ నేరానికి పాల్పడినట్టు రుజువు కావడంతో ఈనెల 10న మరణ శిక్ష విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2009లో నాగేంద్రన్ తన తొడకు 42.72 గ్రాముల హెరాయిన్‌ను కట్టుకొని మలేసియా-సింగపూర్ సరిహద్దును దాటుతూ పట్టుబడ్డాడు. సింగపూర్ చట్టాల ప్రకారం 15 గ్రాములకు మించి హెరాయిన్‌ను అక్రమ రవాణా చేస్తే మరణ శిక్ష విధిస్తారు. విచారణ జరిపిన కింది కోర్టు 2010 నవంబరులో ఆయనకు మరణ శిక్ష విధించింది. అప్పీళ్లన్నీ విఫలం కావడంతో ప్రస్తుతం శిక్ష అమలుకు ప్రభుత్వం సిద్ధమయింది. మానసిక స్థితి సక్రమంగా లేకపోవడం వల్లనే హెరాయిన్ ను అక్రమంగా తీసుకు వచ్చాడన్న వాదన వైద్య పరీక్షల్లో నిలవలేదని కూడా ప్రభుత్వం పేర్కొంది.





