
కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించారు. కరోనా టీకాను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, రెండో డోసులూ తీసుకోవడం ముఖ్యమని నొక్కి చెప్పారు. వ్యాధులను, శత్రువులను తక్కువగా అంచనా వేయొద్దని.. తుదముట్టించేంత వరకూ పోరాడాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా తగ్గిపోయిందని టీకాను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఎన్నో దేశాలు ఆందోళన చెందుతున్నాయని, ఆ పరిస్థితి భారత్‌కు రానీయొద్దని కోరారు. దీన్ని మన దేశం భరించే పరిస్థితుల్లో కూడా లేదని పేర్కొన్నారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన ప్రధాని బుధవారం మధ్యాహ్నం వ్యాక్సినేషన్ పురోగతిపై 40 జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. కేవలం కలెక్టర్లతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పాల్గొనడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ”అందరి కృషి వల్లే దేశంలో వ్యాక్సినేషన్‌లో పురోగతి సాధ్యమైంది. బిలియన్ (100కోట్ల టీకాలు) మైలురాయి చేరుకున్న తర్వాత నిర్లక్ష్యం వహిస్తే కొత్త కష్టాల్లో పడిపోతాం. ఇకముందు కూడా జిల్లాల్లో వ్యాక్సినేషన్ పెంచడానికి నూతన పంథాలో వెళ్లాల్సి ఉంటుంది. 100% వ్యాక్సినేషన్ చేసిన రాష్ట్రాల్లోనూ ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అవి వాటిని అధిగమించి ముందుకెళ్లాయి. కనిపించని శత్రువుతో ఎలా పోరాడాలన్నది ఆశా కార్యకర్తలు నేర్చుకున్నారు. ఇక ముందు జిల్లా, రాష్ట్రం అన్న పదాలను వదిలిపెట్టి గ్రామాలు, వీధుల్లో ఉన్న ఇళ్లను గుర్తించి వ్యాక్సిన్ అందించాలి. క్షేత్రస్థాయిలో టీకాలు అందించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాటి మధ్య ఆరోగ్యకరమైన పోటీ పెడితే మంచి ఫలితాలు వస్తాయి. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల సేవలనూ వినియోగించుకోండి. పోలీసు, ప్రభుత్వ విభాగాల్లో ఉన్న మహిళల సేవలను వ్యాక్సినేషన్ కోసం ఒక వారం పాటు ఉపయోగించుకోవాలి. దాంతో ఫలితాలు వేగంగా మారిపోతాయి. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం ద్వారా వ్యాక్సినేషన్‌పై ఉన్న అపోహలను పూర్తిగా తొలగించాలి. ఈ విషయంలో మతపెద్దల సాయం తీసుకోవాలి. వారి సందేశాలను వీడియోల రూపంలో ప్రజలకు చేరవేయాలి. ఇప్పటివరకు ప్రజలను వ్యాక్సినేషన్ సెంటర్లకు తీసుకొచ్చి టీకా అందించారు. ఇప్పుడు అర్హులైన ప్రతిఒక్కరికీ అందించాలన్న ఉత్సాహంతో ప్రతి ఇంటినీ చేరుకోవాలి. మీ సహచరులు కొన్ని జిల్లాల్లో వేగంగా వ్యాక్సినేషన్ పూర్తిచేశారు. అదేరీతిలో మీ జిల్లాల్లోనూ చర్యలు చేపట్టండి. ఆదివాసీలు, వనవాసీలకు వ్యాక్సిన్ అందించడానికి మరింత శ్రమించాలి. బిర్సా ముండా వంటి ప్రముఖుల జయంతి నాడు ఆదివాసీ ప్రాంతాల్లో ఉత్సవ వాతావరణంలో వ్యాక్సినేషన్ నిర్వహించండి. సరళంగా, స్థానిక భాషల్లో అర్థమయ్యేలా ప్రజలకు చెప్పండి. మొదటి డోసులాగే రెండో డోసుకూ ప్రాధాన్యం ఇవ్వాలి. టీకా పట్ల ప్రజల్లో ఆసక్తి తగ్గకుండా చూడాలి. ఈసారి 100కోట్ల డోసులు పూర్తి చేసుకోవడంతో దీపావళి ఉత్సాహం అలుముకొంది. అలాగే కొత్త లక్ష్యాన్ని పూర్తి చేసుకొని క్రిస్మస్‌ను కూడా ఉత్సాహంగా జరుపుకోవాలి. ఇంటింటి తలుపుతట్టి టీకా అందించాలి” అని ప్రధాని జిల్లా అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు ఉద్ధవ్ ఠాక్రే, భూపేశ్ బఘేల్ సహా పలువురు సీఎంలు పాల్గొన్నారు.





