
దీపావళి నాడు టిఫిన్ బాక్స్ బాంబుతో పేలుడు సృష్టించాలని తీవ్రవాదులు ప్రయత్నించగా పంజాబ్ పోలీసులు అడ్డుకున్నారు. భారత్ – పాక్ సరిహద్దుల్లోని ఫిరోజ్ పూర్ జిల్లాలోని వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన టిఫిన్ బాంబు బాక్స్ ను పోలీసులు నిర్వీర్యం చేశారు. జలాలాబాద్ పేలుడు కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులే దీనిని అమర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారించగా టిఫిన్ బాక్స్ బాంబు విషయం బయటపెట్టారు. పోలీసుల బృందం టిఫిన్ బాక్స్ బాంబు పెట్టిన అలీకే గ్రామానికి వెళ్లి ఆ బాంబును నిర్వీర్యం చేశారు. కాగా జలాలాబాద్ పేలుడు కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తోంది. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్న రంజిత్ సింగ్ కు షెల్టర్ కల్పించిన ఆయన తండ్రి జశ్వంత్ సింగ్, బల్వంత్ సింగ్ లను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రంజిత్ సింగ్ కు సహకరించిన తర్లోక్ సింగ్ పరారీలో ఉన్నాడు. నిందితులపై సిద్వాన్ బెట్ పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్లు 212, 216 చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) సవరణ చట్టంలోని 18,19 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.





