News

హిందువునే… ఎస్సీనీ…

615views
  • ఎన్‌సీబీ ముంబై జోనల్‌ డైరెక్టర్‌ వాఖండే స్పష్టం

ముంబై: బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను డ్రగ్స్‌ కేసులో అరెస్టు చేసిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ముంబై జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే ను లక్ష్యంగా చేసుకొని మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కూటమి నేతలు గత కొద్దీ రోజులుగా పలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఆయనపై వ్యక్తిగతంగా పలు ఆరోపణలు చేస్తున్నారు.

వాఖండే అసలు హిందువు కాదని, పుట్టకతో ముస్లిం అని, తప్పుడు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడని అంటూ ఆరోపణలు చేస్తున్నారు. సమీర్‌ వాంఖడే ఓ ముస్లిం అని, అతనికి డీ కంపెనీతో లింకులు ఉన్నాయని కూడా ఆరోపించారు. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఉద్యోగం కోసం సమీర్‌ వాంఖడే కులధ్రువీకరణ పత్రాన్ని ఫోర్జరీ చేసినట్టు ఆరోపించారు.

కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ అరుణ్‌ హల్దర్‌ ఆదివారం ముంబైలోని వాఖండే ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను విచారించారు. ఆయన కులంకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ‘ఒక ప్రభుత్వ అధికారి తప్పుడు సర్టిఫికెట్‌లను ఇస్తాడని అనుకోను. ఈ విషయమై వస్తున్న వార్త కథనాలను చూస్తుంటే కొందరు వ్యక్తులు వాఖండేకు వ్యతిరేకంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తున్నది’ అని అన్నారు. తమ కమిషన్‌ షెడ్యూల్డ్‌ కులాలవారు రక్షణ కోసమే పనిచేస్తున్నదని స్పష్టం చేస్తూ, అటువంటి కుట్రపూరిత చర్యలు వెల్లడైతే అందుకు బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద తగు చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో సోమవారం సమీర్‌ వాంఖడే మౌనం వీడి నేడు తన కుల ధ్రువీకరణ పత్రాన్ని ఢిల్లీలోని నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్‌ క్యాస్ట్‌కు సమర్పించారు. తాను హిందువునే అని స్పష్టం చేస్తూ, తాను మాత్రం షెడ్యూల్‌ కులానికి చెందినట్టు సమీర్‌ వాంఖడే ఆధారాలు అందజేశారు. ఆ పత్రాలను పరిశీలించిన తర్వాత వివరణ ఇస్తామని ఎస్సీ జాతీయ కమిషన్‌ సభ్యుడు సుభాష్‌ రామ్‌నాథ్‌ పార్ది తెలిపారు. కమిషన్‌ అడిగిన అన్ని దస్త్రాలను, వాస్తవాలను సమర్పించినట్టు సమీర్‌ వాంఖడే తెలిపారు. తన ఫిర్యాదును కమిషన్‌ సమీక్షిస్తుందని, త్వరలోనే కమిషన్‌ చైర్మన్‌ వివరణ ఇస్తారని సమీర్‌ చెప్పారు. సమీర్‌ అందజేసిన పత్రాలను మహారాష్ట్ర ప్రభుత్వం వద్ద పరిశీలిస్తామని జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విజయ్‌ సంపాలా తెలిపారు.

సమీర్‌ వాంఖడే ముస్లిం పేరు పెట్టుకున్నాడని, అతని కుల ధ్రువీకరణ సర్టిఫికేట్‌ మాత్రం హిందువులదని మంత్రి నవాబ్‌ ఆరోపణలు చేశారు. దీనిపై సమీర్‌ పత్రికా ప్రకటన చేశారు. తన తండ్రి ధ్యాన్‌దేవ్‌ కచ్రూజీ వాంఖడే దళితుడని, ఎక్సైజ్‌ శాఖ ఇన్‌స్పెక్టర్‌గా చేసి రిటైరయ్యారని వెల్ల‌డించారు. తన తండ్రి హిందువు అని, తల్లి జహీదా ముస్లిం మతస్తురాలని సమీర్‌ తన ప్రకటనలో స్పష్టం చేశారు.

సమీర్‌ తండ్రి కూడా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తాను దళితుడిని అని చెప్పారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ను ఫాలో అవుతున్నట్టు వెల్ల‌డించారు. మంత్రి నవాబ్‌ మాలిక్‌ తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నట్టు ఆరోపించారు. క్రూయిజ్‌లో డ్రగ్స్‌ పార్టీపై దాడి చేసి ఆర్యన్‌ను అరెస్టు చేసిన తర్వాత సమీర్‌ వాంఖడేపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి