-
ఉప రాష్ట్రపతి వెల్లడి
రాజస్థాన్: సరిహద్దుల్లోని సైనికుల వల్లే భారతదేశం సురక్షితంగా ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా రెండో రోజైన సోమవారం ఆయన జైసల్మేర్‌లోని యుద్ధ ప్రదర్శనశాలను సందర్శించారు. అమర సైనికులకు నివాళులు అర్పించారు. ప్రాంగణంలో మొక్క నాటారు.
అనంతరం సరిహద్దు భద్రత దళం(బీఎస్‌ఎఫ్) 191వ బెటాలియన్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి అక్కడి సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు జైసల్మేర్‌లో సైనిక సిబ్బందిని ఉద్దేశించి కూడా ప్రసంగించారు. సమాచార, సైబర్ స్పేస్ వంటి అంశాల్లో సాయుధ బలగాలు పైచేయి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
అదే సమయంలో సంప్రదాయ యుద్ధ సన్నద్ధతను కాపాడుకోవాలని స్పష్టం చేశారు. భౌగోళిక వ్యూహాత్మక వాతావరణం అనూహ్యంగా మారిపోతోందని, అంతర్గతంగానూ, బహిర్గతంగానూ దేశాన్ని అస్థిరపరిచే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.