News

ఇస్లామాబాద్‌లో ఎగిరిన తాలిబాన్‌ జెండాలు!

763views
  • పాకిస్తాన్‌… ‘పాకిస్తాన్‌ తాలిబన్‌’ కానుందా?

  • ‘సలాం తాలిబన్‌’ గీతాన్ని పాడిన విద్యార్థులు

  • ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ముచ్చెమటలు 

ఇస్లామాబాద్‌: అసలు ఆట ఇప్పుడు మొదలైనట్టుంది… ఆఫ్ఘానిస్తాన్‌ ఆక్రమణలో తాలిబన్లకు సాయం చేసిన పాకిస్తాన్‌కు ఇప్పుడు వారే పక్కలో బల్లెంలా తయారయ్యారు. దీంతో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అమెరికా తాలిబన్‌ నేతలను వేటాడుతున్న సమయంలో పాక్‌ వారిని హత్తుకుంది. ఎన్నో విధాలుగా సహాయ పడుతూ వచ్చింది. ఇప్పుడు అదే పాకిస్తాన్‌లో తాలిబన్‌ జెండాలు ఎగురుతూ ఉండడం పాక్‌ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి.

తుపాకీతో బెదిరింపు

ఇస్లామాబాద్‌లోని జామియా హఫ్సా మదర్సాలో ఆదివారం తాలిబన్‌ జెండాలు రెపరెపలాడాయి. అయితే, ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం జెండాలను తొలగించడానికి పోలీసులను పంపినప్పటికీ అది వీలు పడలేదు. మదర్సా నిర్వాహకుడు మౌలానా అబ్దుల్‌ అజీజ్‌ ఏకంగా పోలీసులనే బెదిరించాడు. పోలీసులు వచ్చే సమయానికి అజీజ్‌ చేతిలో ఏకే 47 తుపాకీతో కనిపించాడు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు మదర్సా టెర్రస్‌పై తాలిబన్‌ జెండాలు ఎగురవేసి నినాదాలు చేశారు. ఈ ఘటన అనంతరం అబ్దుల్‌ అజీజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

గతంలోనూ తాలిబన్‌ జెండా రెపరెపలు

కాబూల్‌ను తాలిబన్‌లు స్వాధీనం చేసుకున్న తర్వాత పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు అనేక ప్రాంతాల్లో తాలిబన్‌ జెండాలు ఎగురవేసి, ర్యాలీలు నిర్వహించారు. ఇప్పుడు ఇస్లామాబాద్‌ నగరం నడిమధ్యలో ఉన్న జామియా హఫ్సా టెర్రస్‌పై తాలిబన్‌ జెండాలు కనిపించాయి. పోలీసులతో మదర్సా నిర్వాహకుడు అజీజ్‌ గొడవపడి బహిరంగంగా బెదిరించాడు. ఇస్లామిక్‌ ఫండమెంటలిస్ట్‌గా పేరుగాంచిన అబ్దుల్‌ అజీజ్‌, రైఫిల్‌ తీసుకుని పాకిస్తాన్‌ తాలిబన్‌ పేరుతో ఇస్లామాబాద్‌ పోలీసులను భయపెట్టాడు. మదర్సాకు చెందిన మహిళలు కూడా అక్కడే ఉన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘తప్పులు జరిగే చోట మీరుండాలి. అంతేకానీ, పిల్లలను భయపెట్టడానికి మదర్సాలకు రావద్దు. ఇక్కడ చర్యలు తీసుకోవడానికి ముందుకొస్తే ఫలితం మాత్రం చాలా చేదుగా ఉంటుంది’ అని చెప్పాడు. ‘ఈ ఉద్యోగం వదిలేయండి.. మీకు అల్లా ఇంకా మంచి ఉద్యోగం ఇస్తాడు.. మీరు ఇలాగే వ్యవహరిస్తే పాకిస్తాన్‌ తాలిబన్‌ మీకు గుణపాఠం నేర్పడం ఖాయం’ అని కూడా హెచ్చరించాడు.

ఆ జెండాలు ఎగురవేస్తే సహించం

ఆఫ్ఘనిస్తాన్‌ ఇస్లామిక్‌ ఎమిరేట్‌ జెండాలను ఎగురవేయడాన్ని సహించబోమని, నేరస్థుడిని శిక్షిస్తామని ఇస్లామాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ హమ్జా షఫ్‌కత్‌ పేర్కొన్నారు. కొన్ని గంటల తర్వాత పోలీసులు మసీదు పైకప్పు నుండి జెండాలను తొలగించారు. ఈ సంఘటన తరువాత మౌలానా, అతని సహచరులపై ఉగ్రవాద నిరోధక చట్టం, పాకిస్తాన్‌ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

మసీదుపై తాలిబన్‌ జెండాలు ఎగురవేయడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కూడా, మసీదులో అనేక తాలిబనీ జెండాలు కనిపించాయి తరువాత వాటిని పోలీసులు తొలగించారు. మదర్సా విద్యార్థులు తాలిబన్లను ప్రశంసిస్తూ ఒక పాట కూడా పాడారు. లాల్‌ మసీదుతో సంబంధం ఉన్న జామియా హఫ్సా సంస్థ ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్‌ స్వాధీనం చేసుకున్న తర్వాత ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ కార్యక్రమంలో విద్యార్థులు ‘సలాం తాలిబన్‌’ అనే పాట కూడా పాడారు.

Source: Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి