News

ప్రత్యేక ఆహ్వానితులుగా TTD ధర్మకర్తల మండలి సభ్యులను పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వ ఆంతర్యమేంటి? – తిరుమల తిరుపతి సంరక్షణ సమితి.

613views

ప్పటికే జంబో పాలకమండలిగా పిలువబడుతున్నతిరుమల తిరుపతి దేవస్థానంలోని ధర్మకర్తల మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో మరి కొంతమందిని జోడించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ నిరుద్యోగుల ఉద్యోగ కల్పనా కేంద్రంగా మారుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సూటిగా ప్రశ్నిస్తూ తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ఒక ఘాటైన ప్రకటనను విడుదల చేసింది. ఈ సందర్భంగా TTD పెద్దల వైఖరిపై తిరుమల తిరుపతి సంరక్షణ సమితి అనేక ప్రశ్నలను సంధించింది. ఈ మేరకు తిరుమల తిరుపతి సంరక్షణ సమితి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ హరి కృష్ణమూర్తి ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశమిదీ….

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీ.ఓ.నె. 245, 568, 569 ల ద్వారా 24 మంది ధర్మ కర్తలను, 52 మంది ప్రత్యేక అహ్వానితులను, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులను TTD ధర్మకర్తలుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.TTD నియమావళిలో ప్రత్యేక అహ్వానితులనే పదమే లేదన్నది ఒక వాదన. 2005లో తిరుమలలో అన్య మత ప్రచారం జరుగుతున్న వివాదాస్పద వేళ ఆ నాటి ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి, శ్రీ పి.వి.అర్.కే ప్రసాద్ TTD ప్రత్యేక అహ్వానితులుగా నియమించారు. ధార్మిక నియమాలకు అనుగుణంగా అనేక క్లిష్ట సమస్యలను పరిష్కరించిన ఘనత శ్రీ పి.వి.అర్.కే ప్రసాద్ ది. టి.టి.డి. ఈ.ఓ.గా పని చేసిన కాలంలో కూడా వారు అనేక మంచి నిర్ణయాలు తీసుకున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ప్రతిసారీ టి.టి.డి ధర్మకర్తల మండలి సభ్యులలో ప్రత్యేక అహ్వానితుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నవి. ఒక పాత సినిమాలో శాసనసభ్యులు అందరూ ముఖ్య మంత్రులే! అలాంటి స్థితి టి.టి.డి.లో రానున్నదా?

ధర్మా చార్యుల మార్గదర్శనంలో ధార్మిక నియమాలకు అనుగుణంగా, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కలుగజేస్తూ టి.టి.డి హిందూ శ్రద్దా కేంద్రంగా, ధర్మ ప్రచార కేంద్రంగా ఉండాలని సాధుసంతులు, భక్తులు కోరుకుంటున్నారు. గత అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రభుత్వంలో పదవులు ఇవ్వలేని వారికి టి.టి.డి.బోర్డ్ సభ్యులుగా (ఉద్యోగాలు) స్థానం కల్పిస్తున్నది. దర్మాచార్యుల, భక్తుల ఆశయాలకు, రాష్ట్ర ప్రభుత్వాల ఈ నియామకాలకు ఏమీ సంబంధం లేకుండా పోతున్నది. తాము తితిదే ధర్మకర్తలం కావడం ఒక గొప్ప అదృష్టంగా సభ్యులు భావిస్తున్నారు. స్వామి వారి దర్శనం పలుమార్లు తాము తమ కుటుంబ సభ్యులతో చేసుకోవచ్చు, తమ మిత్రులకు దర్శన భాగ్యం కల్పించ వచ్చు అన్నది పలువురు సభ్యుల భావన. ఇప్పటికే టి.టి.డి.లోని ఉద్యోగులు తాము ఒక గొప్ప దేవాలయంలో పనిచేసే భక్తులమన్న సంగతి మరచారు. నిర్జీవ మైన ప్రభుత్వ ఉద్యోగస్తుల వలె భావిస్తూ, వ్యవహరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో నియమితులైన ఈ ధర్మకర్తలకు వారి రాక సందర్భంగా సేవలు చెయ్యడం, వారు పంపే భక్తులకు దర్శనాలు చేయించే పనే ఉద్యోగులకు అనేక రెట్లు పెరుగుతుంది.

భక్తులకు, దేవునికి సేవ కాక ధర్మకర్తల సేవ మరింత పెరగనుంది. వివిధ పార్టీల, రాష్ట్ర ప్రభుత్వాల నాయకుల అభిప్రాయాలను మన్నించి ధర్మ కర్తలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తాము టి.టి.డి.ద్వారా చేసే అనుచిత నిర్ణయాలను విమర్శించేవారు లేకుండా ఈ చర్యల ద్వారా చేసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఆనంద పడుతూ ఉండవచ్చు. ఈ సభ్యులలో ఎంతమంది టి.టి.డి. సరిగ్గా నడవడానికి, ఇ.ఓ. కర్తవ్య నిర్వహణకు అడ్డు పడకుండా ఉంటారు? ఇప్పటికే టి.టి.డి.నిధులు ధార్మికేతర కార్యక్రమాలకు మళ్ళించబడుతున్నాయి. ఇప్పుడున్న ఈ ధర్మకర్తలలో TTD లో జరుగుతున్న అవకతవకల పట్ల ఆవేదన చెందే ధర్మ కర్తలు ఎందరు? TTD లాంటి మినీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో నిపుణులుగా ఉన్న సభ్యులు ఎంతమంది ఉన్నారు?

ఇలాంటి అనుచిత నిర్ణయాలు జరుగుతున్న వేళ దేవాలయాల నిర్వహణా బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుండి తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని తిరుమల తిరుపతి సంరక్షణ సమితి భావిస్తోంది. దేవాదాయ శాఖను రద్దు చేయాల్సిన సమయం కూడా దగ్గర పడుతున్నది. పెద్దలు,భక్తులు ఈ దిశలో కార్యాచరణ చేయాలని కూడా తిరుమల తిరుపతి సంరక్షణ అమితి పిలుపునిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.