ArticlesNews

ఉవ్వెత్తున ఎగసిపడ్డ అగ్ని కెరటం మదన్ లాల్ ఢీంగ్రా

262views

లండన్ లోని “ఇండియా హౌస్” లో ఒకరోజు ఒక యువకుడు, ఆయన మిత్రులు కలసి ఏదో విషయంపై చర్చించుకుంటున్నారు. అక్కడ జపనీయుల సాహసము, ఆత్మత్యాగాల గురించి, వారి సాహస ప్రవృత్తి గురించి చర్చ జరుగుతోంది. కానీ ఆ యువకుడికి తన మితృల ఆలోచన నచ్చలేదు. “జపనీయుల గురించి చాలా ఎక్కువగా ప్రశం సిస్తున్నారు. హిందూ ప్రజలు వారికంటే తక్కువ వారని మీరు భావిస్తున్నారా? సమయం వచ్చినప్పుడు భారతీయులు కూడా వారి కర్తవ్య నిష్టను ప్రపంచం మొత్తానికి తెలియజేయగలరు.”

నిజానికి అక్కడున్న మిగతా యువకులకందరికీ మామూలుగానే ఆ యువకుడిపై కొంత తేలిక అభిప్రాయముంది. అతని మాటలకు వారందరూ పగలబడి నవ్వటం ప్రారంభించారు. వారు అతనితో “మాకు నీ గురించి బాగా తెలుసు. నీవు కేవలం మాటలు మాత్రమే చెప్తావు. సమయం వచ్చినప్పుడు ఏమీ చేయలేవు” అని అన్నారు. అతను వారి మాటలు ఒప్పుకోలేదు. వారు కూడా అతనిని గేలిచేయటం మానలేదు. నవ్వులతో మొదలయిన మాటలు వివాదంగా పరిణమించాయి. ఆ యువకుని సాహసానికి పరీక్ష పెట్టాలని వారంతా భావించారు. ఆ యువకుడు కూడా అందుకు సిద్ధపడ్డాడు. మిత్రులలో ఒకరు ఒక లావైన, పొడవైన సూదిని తీసుకొని వచ్చి ఆ యువకుడ్నితన అరచేతిని ఎదురుగా ఉన్న బల్ల మీదుంచమని చెప్పాడు. ఆ యువకుడు తన అరచేతిని బల్లమీద ఉంచాడు.

అందరికళ్ళూ అతని అరచేతి మీదే. సూదిని తెచ్చిన యువకుడు దానిని ఆయన చేతికి గుచ్చడం ప్రారంభించాడు. ఆ సూది చేతియొక్క చర్మాన్ని చీల్చుకుంటూ లోపలికి పోవటం ప్రారంభించింది. ఆ యువకుడి మొహంలో ఏ మాత్రమూ ఆందోళన కానరావటం లేదు. యువకుడు సూదిని మరింత లోపలికి గుచ్చటం ప్రారంభించాడు. సూది అరచేతిని చీల్చుకొని బయటకు వచ్చింది. దాని మొన బల్లలోకి గుచ్చుకుపోయింది. రక్తం కారడం ప్రారంభించింది. బాధ ఎక్కువ అయింది. అయినా ఆ యువకుడు రాయివలె నిశ్చలంగా నిలుచుని వున్నాడు. సూదిని బయటకు తీసిన తరువాత కూడా ఏమీ జరగ నట్లు నవ్వుతూ వున్నాడు. పదునైన, లావుపాటి సూది అరచేతిని చీల్చుకుంటూ క్రిందికి దిగుతూ ఉన్నా, రక్తం ధారలు కడుతున్నా నిబ్బరంగా చిరునవ్వులు చిందిస్తూ నిలుచున్న ఆ యువకుని మనోబలం చూసి అతని సహచరులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఆ యువ కిశోరమే అవిస్మరణీయ దేశభక్తుడు మన మదన్ లాల్ ఢీంగ్రా.

పరాధీనుల మధ్య పరమ దేశభక్తుడు

18 సెప్టెంబర్ 1883లో అమృత్ సర్ లోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు మదన్ లాల్ ఢీంగ్రా. ఢీంగ్రా తండ్రి ఒక ప్రముఖ వైద్యుడు. ఆంగ్లేయుల పట్ల అత్యంత విధేయత కలిగినవాడు. ఢీంగ్రా పెద్దన్నయ్య బీహారీలాల్ కూడా వైద్యవిద్యను అభ్యసించి ఇంగ్లాండ్ లోనే స్థిరపడ్డాడు. ఆయన కూడా ఆంగ్లేయులకు పరమభక్తుడు. కానీ మన కథానాయకుడు మాత్రం తండ్రి, అన్నలకు విరుద్ధమైన వైఖరి కలిగినవాడు. స్వేచ్ఛా ప్రియుడు. ఎంతటి స్వేచ్ఛా ప్రియుడంటే తన చదువులకయ్యే ఖర్చులను తండ్రి నుంచి తీసుకోవడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. తనే ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి సంపాదించి తన సొంత ఖర్చులు, చదువుకయ్యే ఖర్చులు జరుపుకునేవాడు. స్నేహితులైన యువతీ యువకులతో ఉల్లాసంగా గడపటం ఆయనకు అత్యంత ఇష్టమైన విషయం. అలంకార ప్రియుడు. ఖరీదైన దుస్తులు ధరించి, వివిధ రకాలైన అత్తరు సువాసనలను వెదజల్లుతూ స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతూ విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడానికే ఆయన ఎక్కువగా ఇష్టపడే వాడు. అదే సమయంలో భారతీయ ఆచార వ్యవహారాల పట్ల, భారతీయుల నిరంతర పోరాటము, శౌర్య పరాక్రమాలను వివరించే భారతదేశ చరిత్ర మరియు పురాణేతిహాసాల పట్ల అత్యంత గౌరవం కలిగినవాడు.

వీరుల కలయిక

1906 జులై నెలలో ఇంజనీరింగ్ చదువు నిమిత్తం ఒక పడవలో లండన్ బయల్దేరాడు ఢీంగ్రా. సుదీర్ఘ ప్రయాణం తర్వాత అక్టోబర్ లో లండన్ చేరాడు. అప్పటికే అతనికి వివాహమై ఒక బిడ్డ కూడా ఉంది. ఇంగ్లండులో పరిచయమైన కొందరి స్నేహితుల ద్వారా ఢీంగ్రా “ఇండియా హౌస్” కు వెళ్ళాడు. ఇండియా హౌస్ లండన్లోని స్వాతంత్ర్య సమర యోధులకు కేంద్రం. ఇంగ్లాండుకు విద్య, ఉద్యోగాల నిమిత్తం వచ్చే భారతీయ యువకులలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించి వారిని సాయుధ స్వతంత్ర్య పోరాటంలో భాగస్వాములను చేసే మహత్కార్యం అక్కడ జరుగుతూండేది. వారందరి నాయకుడు వినాయక దామోదర సావార్కర్.

ఢీంగ్రా అక్కడికి వెళ్ళిన మొదటిరోజే వీర సావార్కర్ ప్రసంగం విని ముగ్ధుడయ్యాడు.అంతులేని ప్రేరణ పొందాడు. దేశమాత దాస్య శృంఖలాలను త్రెంచడానికి జరుగుతున్న పోరాటంలో తాను కూడా భాగస్వామి కావాలని నిర్ణయించుకున్నాడు. ఆ పోరాటంలో తన ప్రాణాలను సమర్పించటానికి కూడా మానసికంగా సిద్ధమయ్యాడు.

పగబట్టిన సింహం

సావార్కర్ అన్నయ్య గణేష్ దామోదర్ సావర్కర్ కూడా తీవ్రవాది. అందరూ ఆయనను ఆత్మీయతతో బాబారావ్ అని పిలిచేవారు. ఆంగ్లేయులు ఆయనను బంధించి “కాలాపానీ” దండన విధించారు. కాలాపానీ అంటే సముద్రము అవతలి వైపునున్న అండమాన్ ద్వీపంలో నిర్బంధించి వుంచ డం. ఈ ద్వీపం పాములు, తేళ్ళు, క్రూర జంతువులలో నిండివుండేది.

బాబారావ్ సావర్కర్ కు విధించిన శిక్షను గురిం చిన సమాచారం విన్న ఢీంగ్రా తన కోపాన్ని అదుపులో వుంచుకో లేకపోయాడు. ఒక హిందూ (భారతీయ) యువకుని ప్రతీకారేచ్ఛ ఎలావుంటుందో ఆంగ్లేయులకు రుచి చూపించాలని నిశ్చయం చేసుకున్నాడు. తన లక్ష్యాన్ని సఫలీకృతం చేసుకోవటానికి అతను ఒక పిస్తోలు కొని దానిని ఎలా ఉపయోగించాలో అభ్యాసం చేయసాగాడు.

బ్రిటిష్ ఉన్నతాధికారి కర్జన్ విల్లీని చంపటానికి పథకం రచించాడు. కర్జన్ భారత్ లో ఉన్నత పదవుల్లో పనిచేసినప్పుడు ఢీంగ్రా తండ్రికి మంచి స్నేహితుడు కూడా. భారతీయ రైతులను పేదరికంలోకి నెట్టిన అనేక నిర్ణయాల్లో కర్జన్ భాగస్వామి. అందుకే ఆయన్ను చంపాలని ఢీంగ్రా నిర్ణయించుకున్నారు. 1909 జులై 1న ‘ఇండియన్ నేషనల్ అసోసియేషన్’ ఏర్పాటు చేసిన విందుకు కర్జన్ తో పాటు చాలామంది బ్రిటిష్ ప్రముఖులు హాజరయ్యారు. విందు ముగిసి వెళ్లిపోతుండగా ఢీంగ్రా దాడిచేసి కర్జన్ ను కాల్చి చంపాడు. ఈ క్రమంలో అడ్డువచ్చిన ఓ పార్శీ డాక్టర్ కావస్ జీ లాల్ కాకా కూడా కాల్పులలో మృతి చెందాడు. ఢీంగ్రాను అరెస్టు చేసి లండన్లోని సెంట్రల్ క్రిమినల్ కోర్టులో విచారణ జరిపారు. ఇక్కడ భారత్ లో కుటుంబం ఢీంగ్రాను పూర్తిగా వెలివేసింది. ఈ మేరకు పత్రికల్లో ప్రకటన కూడా ఇవ్వటం గమనార్హం. కానీ దేశభక్తులైన కొందరు భారతీయులు మాత్రం ఢీంగ్రాను తమ సొంత సోదరుడిగా భావించి అతను చేసిన పనికి గర్వించారు. ఢీంగ్రాని భారతమాత ప్రియ పుత్రుడిగా అభివర్ణించారు. ఢీంగ్రా భరతమాత గౌరవ ప్రతిష్ఠలు పెంచారనేది వారి భావన.

మరపురాని మరణ వాగ్మూలం

లండనులోని ఉన్నత న్యాయస్థానంలో ఢీంగ్రాపై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా 1909 జులై 10న ఢీంగ్రా ఇచ్చిన వాగ్మూలం అత్యంత చారిత్రాత్మకమైనది.

“జర్మనీ మీ బ్రిటన్ ను ఆక్రమించుకొని దోచుకుంటే జర్మన్లతో పోరాడటం మీకు దేశభక్తి ఎలా అవుతుందో…. మా భారత్ ను దోచుకుంటున్న మీతో పోరాడుతున్న మాదీ దేశభక్తే. మీరిక్కడికి తెస్తున్న ప్రతి పౌండ్ ఎంతోమంది భారతీయుల ప్రాణాలను తోడి తెస్తున్నది. బ్రిటన్ ను ఆక్రమించుకునే హక్కు జర్మనీకి లేనట్లే… భారత్ ను ఆక్రమించుకునే హక్కు మీ బ్రిటిషర్లకూ లేదు. చచ్చే ముందు మీ బ్రిటిష్ వారి ద్వంద్వనీతిని ప్రపంచానికి చాటడానికే ఈ ప్రకటన చేస్తున్నా.

నేను ఒక హిందువును. నేను నా దేశానికి జరిగిన అవమానాన్ని నా దైవానికి జరిగిన అవమానంగా భావిస్తాను. నా మాతృభూమికి నా రక్తాన్ని తప్ప నేను ఇంకేమి సమర్పించుకోగలను? అందుకే మాతృభూమి సేవలో నేను నా రక్తాన్ని సమర్పిస్తున్నాను. నా దృష్టిలో తల్లి భారతమాత సేవయే శ్రీరామ సేవ, శ్రీ కృష్ణుని సేవ. అందుకే నేను నా ప్రాణాలను త్యాగం చేస్తున్నాను. నాకు నా ఈ చర్య పట్ల గర్వంగా ఉంది. నా కోరిక ఏంటంటే…… నా తల్లి భారతి దాస్య శృంఖలాల నుంచి విముక్తమై స్వతంత్రురాలయ్యే వరకూ నేను మళ్ళీ మళ్ళీ ఈ పవిత్ర భరతభూమిలోనే జన్మించాలి. నా మాతృభూమి భరతమాత కొరకు నేను మళ్ళీ మళ్ళీ ప్రాణత్యాగం చెయ్యాలి. ఆ అవకాశం కోసం నేను ఉవ్విళ్ళూరుతున్నాను. ఆ పరమేశ్వరుడు నా ఈ కోరికను తప్పక తీర్చాలి. వందేమాతరం.”

నవ్వుతూ నవ్వుతూ ఉరికంబానికి….

విచారణ జులై 24వ తేదీన పూర్తయింది. ఢీంగ్రాకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఆగస్టు 18,1909. పెంటోన్ విలే కారాగారం… ఉరికొయ్య దగ్గరకు నడచి వస్తున్న వేళలో సైతం ఢీంగ్రా ముఖంపై చిరునవ్వు చెరిగిపోలేదు. ఎన్నాళ్ళ తర్వాతో అమ్మ ఒడి చేరనున్న చంటిపాపాయిలా నవ్వులు చిందిస్తూ ఒక చేత భగవద్గీత, నోటిపై రామకృష్ణుల నామ స్మరణతో ఉరికంబమెక్కాడు.

విప్లవ వీరుల ప్రేరక మంత్రం మదన్ లాల్ ఢీంగ్రా

ఆరోజు భారతదేశంలోని ఎందరో దేశభక్తుల హృదయాలు దుఃఖ సాగరంలో మునిగిపోయాయ్. ఖరీదైన దుస్తులు ధరించి, రకరకాల సువాసనలు వెదజల్లే అత్తరులు చల్లుకుని స్నేహితులతో కలిసి పార్టీలు, విందులు చేసుకుంటూ లండన్ వీధులలో విలాసంగా తిరిగిన ఓ యువ కెరటం భరతమాత పవిత్ర చరణాల వద్దకు చేరింది. కోట్లాది హృదయాలలో ఒక అగ్నికణంలా వినూత్నంగా ప్రజ్వరిల్లింది. ఢీంగ్రా కోరుకున్నట్లుగానే ఆయన మరణం కోట్లాది దేశభక్తుల హృదయాలలో స్వాతంత్ర్యేచ్ఛను రగుల్కొలిపింది. ఆ తర్వాతికాలంలో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వీరుల బలిదానాలకు మదన్ లాల్ ఢీంగ్రా బలిదానమే ప్రేరణ అంటే అతిశయోక్తి కాదు. ఢీంగ్రా మృతదేహాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా ఖననం చేశారు. గమ్మత్తేమిటంటే- డయ్యర్ ను చంపిన ఉద్ధంసింగ్ అస్థికల కోసం వెతుకుతుంటే… ఢీంగ్రా అస్థికలు కూడా బయటపడ్డాయి. 67 సంవత్సరాల తర్వాత 1976లో అవి భారత్ కు వచ్చాయి. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా హాజరై నివాళి అర్పించారు.

అతిపిన్న వయస్సులో మదన్ లాల్ ఢీంగ్రా చేసిన త్యాగం మరువలేనిది. దేశ స్వాతంత్ర్య సాధన కోసం అటు కుటుంబానికి, ఇటు భార్యా పిల్లలకి దూరమై దేశమాత దాస్య శృంఖలాలను త్రెంచడానికి ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన మదన్ లాల్ ఢీంగ్రా చిరస్మరణీయుడు. భారతీయుల హృదయకమలాలలో చిరస్థానం సంపాదించుకున్న అమరుడు.

* ఆ మహా వీరుని జయంతి నేడు

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.