
పెద్దపల్లి: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని మండలం జనగాంలోని శిథిలంగా మారిన శివాలయం వద్ద అరుదైన మూషిక శిల్పం బయటపడిరది. ఈ శివాలయం 800 ఏళ్ల నాటిది. పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కాకతీయుల కాలం నాటి త్రిలింగ రాజరాజేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న త్రికూటాలయంలో తుప్పలు, పొదలు తొలగిస్తుండగా గణపతి వాహనం వెలుగుచూసిందని చెప్పారు.
ఈ శిల్పం మూడు అడుగుల పొడవు, రెండున్నర అడుగుల ఎత్తు ఉందని శివనాగిరెడ్డి తెలిపారు. తెలంగాణలో ఇదే అతిపెద్ద మూషిక విగ్రహమని చెప్పారు. సర్వాభరణాలతో అలంకరించినట్టున్న ఈ శిల్పం గణపతిదేవుడి కాలానికి చెందినదని వివరించారు. త్రికూటాలయంలో రెండు ఆలయాల్లో శివలింగాలు ఉన్నాయని… మూడో ఆలయం వినాయకుడిది అయిఉండొచ్చని చెప్పారు. గుప్తనిధుల కోసం ఈ విగ్రహాన్ని పెకిలించి ఉండొచ్చని తెలిపారు.
Source: Andhraprabha





