
మహారాష్ట్రలోని పూణేకు చెందిన బీజేపీ కార్యకర్త మయూర్ ముండే, తనకు చెందిన అనుద్ ప్రాంతంలోని రోడ్డు పక్కన స్థలంలో ప్రధాని మోడీకి చిన్న గుడి కట్టిన వార్త దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. దీని కోసం ఆ అభిమాని రూ.1.6 లక్షలు ఖర్చు చేశారు. జైపూర్ నుంచి ఎర్రని పాల రాయిని తెప్పించి నిర్మాణానికి వినియోగించారు. తెల్ల పాలరాయితో చేసిన ప్రధాని విగ్రహాన్ని అందులో ఏర్పాటు చేశారు. భద్రతగా ముందు వైపు గట్టి అద్దాన్ని ఫిక్స్ చేశారు. ఆ గుడి ముందు మోడీకి అంకితమిస్తూ ఒక పద్యంతో కూడిన బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఆరు నెలల్లో ఆ గుడి నిర్మాణాన్ని పూర్తి చేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం దీనిని ప్రారంభించారు. ప్రధాని అయిన తర్వాత మోడీ చాలా అభివృద్ధి పనులు చేశారని, జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం వంటి వాటి పట్ల విజయవంతంగా వ్యవహరించారని ముండే అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించిన వ్యక్తికి కూడా ఒక మందిరం ఉండాలని తాను భావించానని, అందుకే మోడీకి గుడిని తన సొంత ప్రాంగణంలో నిర్మించినట్లు చెప్పారు.
మోడీ మీద ఆయన ఇలా అభిమానాన్ని చూపించినా.. కొందరు మాత్రం ఆయన చర్యలను తప్పుబట్టారు. ఈ గుడి విషయం మీడియాలో రావడంతో ప్రధాన మంత్రి కార్యాలయం కూడా స్పందించింది. ఇది ఆమోదయోగ్యం కాదంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆలయంలోని మోడీ విగ్రహాన్ని తొలగించారు. ప్రస్తుతం ఈ విగ్రహం స్థానిక బీజేపీ కౌన్సిలర్ ఇంట్లో ఉంచారు. గురువారం అటుగా వెళ్లిన వ్యక్తులకు ఆ ఆలయంలో విగ్రహం కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళింది? అని అడగగా అసలు విషయం చెప్పారు.
Source : Nationalist Hub





