
హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డుపై వాహనాలు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ట్రక్కు, బస్సు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రిక్‌కాంగ్ పియో-షిమ్లా జాతీయ రహదారిపై ఉన్న కిన్నౌర్ వద్ద మధ్యాహ్నం 12.45 నిమిషాలకు కొండచరియలు విరిగిపడినట్లు ఐటీబీపీ తెలిపింది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇండో-టిబెట్ బోర్డర్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సుతో పాటు ఓ ట్రక్కు శిథిలాల కింద చిక్కుకుందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో పది మందిని రక్షించారు. ఐటీబీపీకి చెందిన మూడు బెటాలియన్లు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి. ఆ ప్రదేశంలో ఇంకా కొన్ని కొండరాళ్లు పడుతున్నట్లు గుర్తించారు. సుమారు 50 మంది కొండచరియల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతం ప్రమాదకరంగా ఉన్నట్లు ఐటీబీపీ ప్రతినిధి వివేక్ పాండే తెలిపారు. ఐటీబీపీలోని 17వ, 19వ, 43వ బెటాలియన్ జవాన్లు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. రెక్‌కాంగ్ పీయో- షిమ్లా హైవేపై పడ్డ కొండచరియలను తొలగించేందుకు ఐటీబీపీ దళాలు ప్రయత్నిస్తున్నాయి.
కిన్నౌర్ జిల్లాలోని నిగుల్సారి వద్ద కొండచరియలు విరిగిపడిన ప్రదేశానికి ఇరువైపుల నుంచి సహాయక చర్యలు ప్రారంభించామని ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ తెలిపారు. నేషనల్ హైవే 5 పూర్తిగా బ్లాక్ అయిందని అధికారులు తెలిపారు. కిన్నౌర్‌లో కొండచరియలు విరిగిపడటంతో చాలా మంది చిక్కుకున్నట్లు సమాచారం అందిందని ప్రభావిత ప్రాంతాల్లో సాధ్యమైనంత సహాయాన్ని అందించాలని పార్టీ కార్యకర్తలను అభ్యర్థిస్తున్నానని బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా కోరారు.
Source : Nationalist Hub





