
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను తీవ్రంగా కుదిపేస్తోన్న పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆ స్పైవేర్ తయారీ సంస్థ, ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ ఎస్ వో గ్రూప్ తో తాము ఎలాంటి ఒప్పందాలూ చేసుకోలేదని కేంద్ర రక్షణశాఖ సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది.
ఎన్ ఎస్ ఓ గ్రూప్ టెక్నాలజీస్ తో రక్షణశాఖకు ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా? అని సీపీఎం ఎంపీ వి. శివదాసన్ రాజ్యసభలో ప్రశ్నించారు. ఒకవేళ ఉంటే వాటి వివరాలు చెప్పాలని అడిగారు. ఇందుకు రక్షణశాఖ సహాయమంత్రి అజయ్ భట్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. “ఎన్ ఎస్ వో గ్రూప్ తో రక్షణశాఖ ఎలాంటి లావాదేవీలు జరపలేదు” అని మంత్రి తెలిపారు. ఈ సంస్థ అభివృద్ధి చేసిన పెగాసస్ స్పైవేర్ తో భారత్ సహా పలు దేశాల ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఒక వర్గం మీడియాలో ఇటీవల సంచలన కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఆ మీడియా కథనాలను ఆసరాగా చేసుకుని ప్రతిపక్షాలు ఉభయసభల్లో నానా గందరగోళం సృష్టించారు.
ఈ స్పైవేర్ ద్వారా భారత్ కు చెందిన దాదాపు 300 మందిని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్నదని సదరు కథనాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, సీబీఐ అధికారులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల ఫోన్లను హ్యాక్ చేసినట్లు కథనాలు వచ్చాయి. ఈ సంస్థ అభివృద్ధి చేసిన పెగాసస్ స్పైవేర్ తో భారత్ సహా పలు దేశాలు ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు పేర్కొంటూ ఇబ్బడిముబ్బడిగా కథనాలు వెలువడ్డాయి.
సరిగ్గా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక్క రోజు ముందు జులై 18న ఈ కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ అంశంపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతూ ఉభయసభల్లో ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ ఉభయసభల్లో చర్చలకు ఆస్కారం లేకుండా వాయిదాల పర్వం కొనసాగుతోంది.
వీటన్నిటి నడుమ పెగాసస్ కథనాలను కేంద్రం కొట్టిపారేసింది. ఇవి భారత ప్రజాస్వామ్యానికి చెడ్డపేరు తేవడమే లక్ష్యంగా కొందరు ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలే… అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. భారత్ లో అనధికారిక నిఘా సాధ్యం కాదని, ఇక్కడ చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీనిపై పార్లమెంటరీ స్థాయి దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నాయి.





