
పాకిస్థాన్ తమ దేశంలోకి 10 వేలమందికి పైగా జిహాదీలను పంపిందని ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని ఆరోపించారు. తాలిబన్లకు పాకిస్థాన్ పూర్తి మద్దతునిస్తుందని ఆయన తెలిపారు. శాంతి చర్చల్లో తాలిబన్లు చురుకుగా పాల్గొనేలా వారికి పాక్ నచ్చజెప్పడంలేదని విమర్శించారు. తాష్కెంట్ లో జరిగిన సెంట్రల్, సౌత్ ఏసియా కనెక్టివిటీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఘని..ఆఫ్ఘన్ లో తాలిబన్లు ఏ ప్రాంతాన్నీ ఆక్రమించుకోలేదని పాక్ చెబుతోందని. అసలు అలా జరగకుండా చూస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన ఆధీనంలోని సైన్యం ఇస్తున్న హామీలు వట్టి నీటి బుడగలేనని అన్నారు. మా దేశంలో తాలిబన్లు, వారి నెట్ వర్క్ లు, వారి సంస్థలు వివిధ ప్రాంతాలను ఆక్రమించుకుని ఆస్తులను ధ్వంసం చేస్తూ బాహాటంగా సంబరాలు చేసుకుంటున్నారని అష్రాఫ్ ఘని ధ్వజమెత్తారు. ఈ సమస్యకు రాజకీయ పరిష్కారమొక్కటే మార్గమని వారు గుర్తించేంతవరకు మేము వారిని ప్రతిఘటిస్తూనే ఉంటామని చెప్పారు.
కాందహార్ లో స్పిన్ బోల్టన్ జిల్లాను, ఇతర ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తాలిబన్లను లక్ష్యంగా చేసుకుంటే ….. ఆఫ్ఘనిస్థాన్ వైమానిక దళంపై మిసైళ్లను ప్రయోగిస్తామని పాక్ మిలిటరీ హెచ్చరించిందని ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు అమాతుల్లా సాహేల్ ఆరోపించారు.ఈ ఆరోపణను పాక్ విదేశాంగ శాఖ ఖండించింది. ఏ ఆధారంతో ఈ ఆరోపణ చేస్తున్నారని ప్రశ్నించింది.





