
భారత సైన్యంలో పనిచేస్తూ పాకిస్థాన్ గూఢచర్య సంస్థ- ‘ఐఎస్‌ఐ’కి రహస్య పత్రాలను చేరవేస్తున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అధికార రహస్యాల చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు. సైన్యానికి చెందిన ఆగ్రా కంటోన్మెంట్‌లో క్లర్క్ గా పరమ్‌జిత్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఐఎస్‌ఐకి రహస్య పత్రాలు చేరవేస్తున్న వ్యవహారానికి సంబంధించి రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో మంగళవారం అదుపులోకి తీసుకున్న హబిర్-ఉర్-రహ్మాన్‌తో అతనికి సంబంధమున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో పరమ్‌జిత్ పోఖ్రాన్‌లో పనిచేశాడని, అప్పుడే హబీబ్‌తో పరిచయం ఏర్పడిందని వారు తెలిపారు. హవాలా మార్గాల్లో డబ్బును స్వీకరిస్తూ.. ఐఎస్‌ఐకి రహస్య సమాచారాన్ని వారిద్దరు చేరవేస్తున్నట్లు తేలిందన్నారు. హబిర్-ఉర్-రహ్మాన్ పై కూడా అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్సులో ఉంటున్న తన బంధువుల సహకారంతో అతను గూఢచర్యాన్ని ఇన్నాళ్లూ కొనసాగించినట్లు గుర్తించామన్నారు.





