
బాపురమణ అకాడమీ మొట్టమొదటిసారిగా ప్రచురించిన ” మనం సరస్వతీ పుత్రులం” అనే పుస్తకాన్ని తే. 11/7/2021 ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతి, కాన్ఫరెన్స్ హాలులో జరిగిన 2021 తెలుగు కార్టూనిస్టుల దినోత్సవ సభలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని సత్కళాభారతి, హాస్యానందం సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, తెలుగు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ, ప్రముఖ సినీ నటుడు, రచయిత శ్రీ తనికెళ్ళ భరణి, ప్రముఖ మాటల రచయిత, కథా రచయిత, నిర్మాత, దర్శకుడు శ్రీ జనార్దన మహర్షి, బాపు – రమణ అకాడమీ డైరెక్టర్ శ్రీ సుబ్బరాజు, ప్రముఖ కార్టూనిస్టు శ్రీ శంకు లు విచ్చేశారు.


అనువాదకులు డాక్టర్ ఓరుగంటి సీతారామ మూర్తి
విద్యా భారతి అఖిలభారత ఉపాధ్యక్షులు శ్రీ దిలీప్ బేత్కేకర్ మరాఠీలో “ఆమ్హి పుత్ర శారదేచ” పేరుతో వ్రాసిన గ్రంథాన్ని ప్రొఫెసర్ రమేష్ చౌగాంవకర్ ” హమ్ సరస్వతీ పుత్ర” పేరుతో హిందీలోకి అనువదించారు. దానిని విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రిటైర్డ్ ప్రిన్సిపాల్, డాక్టర్ ఓరుగంటి సీతారామ మూర్తి “మనం సరస్వతీ పుత్రులం” అంటూ తెలుగులోకి అనువదించారు.
ఈ పుస్తకం ఉపాధ్యాయుల బాధ్యతను గుర్తు చేసేదిగా ఉన్నదని, ఇది ఎంతో విలువైన గ్రంథమని, దీనిని రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రతి పాఠశాలలోని ప్రతి ఉపాధ్యాయుడూ చదవవలసిన అవసరమున్నదని, ఆ మేరకు తెలుగు రాష్ట్రాలలోని ప్రతి పాఠశాలకూ, ప్రతి ఉపాధ్యాయుడికీ ఈ పుస్తకాన్ని చేర్చే ప్రయత్నం చేస్తున్నామని బాపు – రమణ అకాడెమీ డైరెక్టర్ శ్రీ సుబ్బరాజు తెలిపారు.





