ArticlesNews

సర్వే భవంతు సుఖినః

856views

కాయన మా వీధిలో ఉండే షాపులో ఆశీర్వాద్ ఆటా దొరకలేదని సింగ్ నగర్ నుంచి పటమటకి వెళ్లి ఆటా తెచ్చుకుంటున్నాడు. ఎప్పుడూ వాకింగ్ చెయ్యనాయన లాక్ డవున్ లో ఖాళీగా ఉన్నాం కదా అని వాకింగ్ పేరుతో ఎప్పుడూ రోడ్ మీదే తిరుగుతుంటున్నాడు. ఒకాయన అలా షికారుగా అత్తారింటికి వెళ్తానంటున్నాడు. లాక్ డవున్ లో రోడ్డు మీద జనం ఉన్నారో లేదో చూసొద్దామని రోడ్డెక్కే వాడొకడు. లాక్ డవున్ తో రోడ్లు ఖాళీగా ఉన్నాయి కదా అని డ్రైవ్ కి వెళ్ళే వాడొకడు. ఖాళీగా ఉన్నాం కదా అని ఫ్రెండ్స్ తో గెట్ టు గెదర్ లు ఏర్పాటు చేసుకునేవారు ఇంకొందరు. అపార్టుమెంటుల్లో ఆడవాళ్ళైతే హౌసీ గేములాడుకుంటున్నారు. మగవాళ్ళు ఎంచక్కా పేకాడుకుంటున్నారు. అప్పుడు మద్యం షాపులు తెరిచినప్పుడు జనం ఎంతగా గుంపులు కట్టారో చూశారుగా? ఇక మన అభిమాన హీరో సినిమా రిలీజైనప్పుడు చూడాలి ఆ ఉత్సాహం. అస్సలు కరోనా అన్నది ఒహటుందన్న మాటే మరచిపోయామా…. దాంతో కరోనాకి కోపం వచ్చి కసిగా కాటేసింది.

అంతెందుకు సార్ మొన్నటికి మొన్న మన భాగ్యనగరంలో….. బంగారంగళ్ళు తెరవడమే తరువాయి “అంతకంటే భాగ్యమా?” అని బంగారం కొనడానికి ఎగబడ్డారట జనం. పాపం ఆకలేసుంటది. కదా? బట్టల షాపుల ముందు గుంపులు కడుతున్నారు. అంతేలెండి….. అసలే కరువు కాలం. కొత్త బట్టలు కొనకపోతే కునకు పట్టదు. కదండీ? పని చేయకపోతే పూట గడవని వారు పని కోసం బయటకు రాకపోతే జరగదు నిజమే. వారినెవరూ ఏమీ అనరు, అనకూడదు కూడా. కానీ మందు (వైన్) షాపుల ముందు క్యూలు కట్టింది, పవర్ స్టార్ సినిమా రిలీజయితే టిక్కెట్ల కోసం తోసుకు చచ్చిందీ ఎవరంటారు? ఏ పనీ లేకపోయినా బయటకొచ్చి బలాదూర్ తిరిగేవాళ్ళనేమనాలి? మాస్కులు ధరించకుండా తిరిగేవాళ్ళనేమనాలి?

ఇవన్నీ ఒకెత్తయితే….. ఖాళీగా ఉన్నాయి కదాని పుణ్య క్షేత్రాలకి క్యూలు కట్టేవారు కొందరు. అలాంటి వారికి, అక్కడనే కాకపోయినా…. మరెక్కడ వైరస్ ఆవహించినా, గోరంతలు కొండంతలు చేసి చెప్పడానికి మన ఘనత వహించిన గడుగ్గాయి మీడియా సదా సిద్ధంగా ఉంటుందాయె. వారి బాధ్యత వారు నిర్వర్తించాలి కదా? వారికందుకే డబ్బులు ముట్టుతాయాయె. మధ్యలో పాపం ఏ పాపమూ ఎరుగని దేవుడికి అపప్రధ. “ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు” అని పోతన చెప్పలేదా? దేవుడు మన ఇంట్లోనూ, వంట్లోనూ కూడా ఉన్నాడు. కనుక మన ఇష్ట దైవానికి, కష్టాలు, అపప్రధ రాకుండా ఉండాలంటే మనం మన ఇంట్లో, వంట్లో కొలువై ఉన్న ఆ దేవదేవుడ్ని, ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడ్ని మనసారా పిలిస్తే పలుకుతాడన్న సత్యాన్ని ఎరిగి మసలుకుంటే చాలు.

కరెక్టే బాసూ… మనం తక్కువ జనం, ఎక్కువ వైశాల్యమున్న అమెరికాలోనో, ఆస్త్రేలియాలోనో లేము. భారత్ లో 140 కోట్ల మంది మధ్య క్రిక్కిరిసి ఉన్నాం. అందుకే మనం మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నాను. బాధ్యతగా మెలగాలంటున్నాను. అసలు ఆ అమెరికాలో, ఆస్ట్రేలియాలో నివసించేవారికి లేనిది, మనకు ఉన్నది ఏంటో తెలుసా? స్వేచ్చ. మనకిప్పుడది ఎక్కువైపోయి దిక్కుతెలీక తెగ కొట్టుకుంటున్నాం. ఎవడిష్టమొచ్చినట్లు వాడు ప్రవర్తిస్తాడు. ఎవడిష్టమొచ్చినట్లు వాడు మాట్లాడుతాడు. “లాక్ డవున్ పెడితే కడుపు నిండేదెట్టా?” అంటాం. లాక్ డవున్ పెట్టకపోతే…. “కరోనాతో వేగేదెట్టా” అంటాం. అన్నీ కావాలంటాం….. ఏదీ వద్దంటాం. ఇవ్వకపోతే ఇవ్వలేదంటాం. ఇస్తే ఎవడికోసమిస్తాడంటాం. చెయ్యకపోతే చెయ్యలేదంటాం. చేస్తే…. ” ఆ…. చేశార్లే పెద్ద గొప్ప” అంటాం. ఈ అతి స్వేచ్చ కూడా మన కొంప ముంచుతోందేమో?

ప్రతి విషయాన్నీ పేదరికానికి ముడి పెట్టి మాట్లాడటం అలవాటైపోయింది మనకు. అంటే మన దేశంలో పేదరికమసలే లేదని, పేదరికం అసలు సమస్యే కాదని నేననటం లేదు. పేదరికం ముమ్మాటికీ శాపమే. వారి కోసం ప్రభుత్వాలు కొంత చేస్తున్నాయ్. ఎన్నో సేవా సంస్థలు, తోటి జనం కూడా ఎంతో చేశారు, చేస్తున్నారు. అఫ్కోర్స్ చెయ్యాల్సింది కూడా చాలా ఉంది. చెయ్యాలి కూడా. అయితే పేదరికాన్ని, పేదవారి ఇబ్బందుల్ని సాకుగా చూపి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తామంటే ఎలా? ఎస్… పనికి వెళ్ళకపోతే పూట గడవదు. వెళ్ళాల్సిందే… అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకోవాలి కదా? అందుకు తగిన ఏర్పాట్లు యాజమాన్యాలు చెయ్యకపోతే నిలదీయాలి కదా? ఓ వంద కూలి తగ్గించి ఇస్తే పోరాటం చేసి సాధించుకోవడం లేదూ? ఇదీ అంతే….. మనం పనిచెయ్యడానికి తగిన వాతావరణాన్ని కల్పించడం యాజమాన్యాల బాధ్యత కదా? అందుకోసం పట్టుబట్టడం తప్పేమీ కాదు. కానీ మనకు అందులో దృష్టి ఉందో, లేదో మనమే ప్రశ్నించుకోవాలి.

సామాన్యుల బాధలు పట్టకుండా సొల్లు వాగే వారిని నేను వెనకేసుకురావడం లేదు. కానీ “కష్టపడకుండా ఎవడూ సంపన్నుడు కాలేడు, ఒకవేళ తాత ముత్తాతలు సంపాదించినవి ఉన్నవాడైనా కష్టపడకపోతే ఆ సంపద నిలుపుకోలేడు.” అని మాత్రం ఘంటాపథంగా చెప్పగలను. అయితే ఒకటి మాత్రం నిజం. వేవ్ లూ, వేరియంట్లూ వస్తూనే ఉంటాయ్. వాటికి భయపడుతూ కూర్చుంటే ఏమీ చెయ్యలేం. కడుపు నిండినవాడిని కాలు కదపకుండా కూర్చోనివ్వండి ఫర్లేదు. మనమూ కొంత పోటీ తగ్గిందనుకుని క్రొత్తగా ఏదయినా ప్రయత్నిద్దాం. ఇదొక అవకాశామనుకుందాం. అయితే… కూసింత జాగ్రత్తగా, బాధ్యతగా మసలుకుందాం. ఇప్పుడు ప్రపంచం మొత్తం మనం వేసే అడుగుల వైపు, మన దేశం వైపే ఆసక్తిగా చూస్తోంది. ఇప్పటి మన చర్యలే మన దేశ భవిష్యత్తుని నిర్ణయించనున్నాయి. మనం ఇప్పుడు జాగ్రత్తగా, శ్రద్ధగా, బాధ్యతగా, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే…..ప్రపంచంలో మన దేశ ప్రతిష్ఠ ఇనుమడిస్తుంది. హాట్…. అవన్నీ మాకెందుకనుకుని, మనం ఎప్పట్లానే బాధ్యతా రహితంగా వ్యవహరిస్తూ, అందుకు ఏవేవో కుంటి సాకులు చెప్పుకుంటూ బ్రతికేస్తే మాత్రం…. మన బ్రతుక్కెవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు.

అసలు జీవితమంటే పోరాటమని ఎవరో డార్విన్ చెప్పింది మనమెందుకినాలి బ్రో? అది ప్రకృతిని, ప్రక్కవాడిని దోచుకుని తినడం మాత్రమే తెలిసిన అనాగరికులున్న ఆయన దేశంలో. “వసుధైవ కుటుంబకమ్” అని నినదించిన మన దేశంలో కాదు. “జీవేమ శరదశ్శతం”, “శతమానం భవతి” అని ఎవరినైనా మనస్పూర్తిగా దీవించే ఎదలున్న ఈ దేశంలో కాదు. ఈ దేశంలో జీవించడమంటే….. మన కోసం మనం జీవించడం కాదు. మన మనుగడ కోసం పరితపించడం కాదు. మనది జీవన పోరాటం కాదు. జీవన గమనం. అందరితో కలిసి, అందరికోసం మనం జీవించడం. ఈ సకల చరాచర సృష్టి సమస్తం…. మనతో సహా ఆనందంగా జీవించాలని అనుక్షణం ఆకాంక్షించడం. ఇదే మన జీవన…. కాదు కాదు మానవ జీవన పరమార్ధం. ఈ సత్యాన్నే యుగ యుగాలుగా మన పవిత్ర గ్రంథాలు బోధించాయి. “సర్వేజనా సుఖినోభవంతు” అని ఘోషించాయి. “బ్రతికితే బ్రతుకుతాం. ఛస్తే ఛస్తాం.” అనే నైరాశ్యం మనకొద్దు. మనం బాధ్యతగా మసలుదాం. మనం ఆనందంగా బ్రతుకుదాం. మన చుట్టూ ఉన్నవారిని మరింత ఆనందంగా, సౌకర్యవంతంగా బ్రతకనిద్దాం. లివ్. లెట్ లివ్.

సర్వే భవంతు సుఖినః

సర్వే సంతు నిరామయాః

సర్వే భద్రాణి పశ్యన్తు

మా కశ్చిత్‌ దుఃఖ భాగ్భవేత్‌

‘అందరూ సంతోషంగా ఉందురు గాక! అందరూ ఆరోగ్యంగా ఉందురు గాక! మంచినే అందరూ ఆస్వాదించెదరు గాక! ఎవ్వరికీ దుఃఖం కలుగకుండు గాక!’

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.