GalleryNews

భారతీయ జానపద కళకు కోసం మిలాన్ నుంచి బంగాల్​కు చేరిన ఎన్రికా

7views

భారతీయ సంప్రదాయ కళల ఖ్యాతి ఖండాతరాలు దాటింది. జానపద కళలు విదేశీయుల్ని సైతం ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. మన దేశంలోని ఎన్నో సంప్రదాయ కళారూపాలను దగ్గరగా తెలుసుకోవడమే కాకుండా, వాటిని స్వయంగా నేర్చుకోవడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం విదేశాల నుంచి కూడా వస్తున్నారు. ఈ క్రమంలోనే బంగాల్​లోని పురులియా సంప్రదాయ ‘ఛౌ’ మాస్కులకు ఇటలీ మహిళ ఎన్రికా కూడా ఆకర్షితులయ్యారు. చేతితో తయారుచేసే ఈ సంప్రదాయ కళను స్థానిక కళాకారుల వద్ద నేర్చుకునేందుకు నేరుగా వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌‌కు వచ్చారు.

వృత్తిరీత్యా టూర్ గైడ్ అయిన 35 ఏళ్ల ఎన్రికా, ఇటలీలోని మిలాన్ సిటీ నుంచి నవంబర్ 18న బంగాల్​లోని పురులియా జిల్లా బఘ్‌ముండిలోని చరిదా గ్రామానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రముఖ మాస్క్ తయారీ కళాకారుడు భీమ్ సూత్రధర్ దగ్గర రోజుకు 6 గంటల పాటు కఠోర శిక్షణ పొందుతూ ఈ సంప్రదాయ హస్తకళలోని మెళకువలను నేర్చుకుంటున్నారు.

ఆన్‌లైన్‌లో చూసి అట్రాక్ట్ అయిన ఎన్రికా
భారతీయ జానపద కళలు, కళారూపాల గురించి ఆన్‌లైన్‌లో పరిశోధన చేస్తున్న సమయంలో ఎన్రికాకు ఈ ఛౌ మాస్కులు కనిపించాయి. ముఖ్యంగా చేతితో తయారుచేసిన ఈ మాస్కులపై కనిపించే విభిన్న ముఖ కవళికలు, రంగులు ఆమెను ఆశ్చర్యపరిచాయి. వాటి తయారీ వెనుక ఉన్నటువంటి అద్భుత సాంకేతికత, కళా నైపుణ్యం ఆమెను ఎంతో ఆకట్టుకున్నాయి. వాటి తయారీలో ఉపయోగించే పద్ధతులపై మరింత ఆసక్తి పెరగడంతో ఇంటర్నెట్‌లో చూసి తెలుసుకోవడంతోనే సరిపెట్టుకోకుండా నేరుగా కళాకారుల దగ్గరికే వచ్చి శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇటలీ నుంచి భారత్‌కు సుదూర ప్రయాణం చేసి వచ్చారు.

కళా నైపుణ్యంతో పాటు చరిత్రపైనా అధ్యయనం
బంకమట్టి, కాగితం, వస్త్రాన్ని కలపడం దగ్గర్నుంచి ముసుగులకు రంగుల పొరలు వేయడం, ముఖ కవళికలను స్పష్టంగా తీర్చిదిద్దడం వరకు ముసుగుల తయారీలోని ప్రతి దశను, అన్ని సాంకేతిక అంశాలనూ ఎన్రికా నేర్చుకుంటున్నారు. కేవలం తయారీ వరకే పరిమితం కాకుండా, ఛౌ నృత్యం, నాటక ప్రదర్శనల్లో ఉపయోగించే ఈ ముసుగుల వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని కూడా ఆమె లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇటలీ నుంచి వచ్చి ఈ కళలో ప్రావీణ్యం సంపాదించాలన్న ఆమె సంకల్పాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లు కళాకారుడు భీమ్ సూత్రధర్ తెలిపారు. మొదట ఎన్రికా తనకు ఫోన్ చేసినప్పుడు కేవలం ముసుగు కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపించారని భావించినట్లు పేర్కొన్నారు. తర్వాత అసలు విషయం అర్థమైందన్నారు. తమ ఊరికి ఎలా చేరుకోవాలో అడిగితే వివరంగా చెప్పానని అన్నారు. ఎన్రికా స్థానికంగా ఉండే లాడ్జ్‌లో ఉంటున్నప్పటికీ, అప్పుడప్పుడు సూత్రధర్ ఇంట్లోనూ ఉంటూ, ఆయన కుటుంబ సభ్యులతో కూడా ఆత్మీయ అనుబంధాన్ని పెంచుకున్నారు.

భారతీయ జానపద కళలపై తనకు ఎప్పుడూ ఆసక్తి ఉండేదని ఎన్రికా తెలిపారు. 12 ఏళ్ల కిందట తొలిసారి భారత్‌కు వచ్చినప్పటి నుంచి రాజస్థాన్, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, అసోం, తెలంగాణ, బంగాల్, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల కళలు, సంస్కృతులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అయితే ఇందులో ఛౌ ముసుగుల ప్రత్యేక రూపకల్పన, హస్తకళా నైపుణ్యం తనను విశేషంగా ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. స్వదేశానికి వెళ్లాక ఈ ముసుగుల్లోని కొన్ని ప్రత్యేకతల్ని తన సొంత కళాసాధనలో ఉపయోగించుకోవాలని ఆమె భావిస్తున్నారు. ఇదే సమయంలో పురులియా సంప్రదాయ కళారూపాన్ని తన దేశ ప్రజలకు పరిచయం చేయడానికి కొన్ని ముసుగుల్ని ఇటలీ కూడా తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. పురులియాకు చెందిన ఛౌ సంప్రదాయ పరిశోధకుడు ఉత్పల్ కుమార్ దాస్‌‌ మాట్లాడుతూ- ‘ఈ జానపద కళ నేర్చుకోవడానికి ఒక విదేశీయురాలు చరిదా గ్రామానికి రావడం వల్ల ప్రాంతీయ సంప్రదాయ కళకు అంతర్జాతీయంగా మరింత గుర్తింపు లభిస్తుంది.’ అని అన్నారు.