News

భారత్ – నేపాల్ బంధానికి కొత్త బలం.. విద్య, సంస్కృతి రంగాల్లో సహకారానికి ABVP స్వాగతం

0views

న్యూఢిల్లీ: భారత్, నేపాల్ మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు చేపడుతున్న చర్యలను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) స్వాగతించింది. భారత పర్యటనకు వచ్చిన నేపాల్ ప్రధానమంత్రి బాలెన్ షాకు స్వాగతం పలుకుతూ, విద్య, పరిశోధన, సాంకేతికత, వ్యవసాయం, వైద్యం వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం పెంపొందించేందుకు తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశంసించింది.

నేపాల్ అభివృద్ధిలో భాగస్వామిగా భారత్ అందిస్తున్న సహకారం ఇరు దేశాల స్నేహబంధానికి నిదర్శనమని ABVP పేర్కొంది. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణం, పునరావాసానికి భారత్ అందిస్తున్న సహాయం ప్రస్తావనీయమని తెలిపింది. శ్రీ ముక్తినాథ్, శ్రీ పశుపతినాథ్, జనక్‌పూర్, లుంబిని వంటి పవిత్ర క్షేత్రాలను సందర్శించాలని నేపాల్ ప్రధాని భారత ప్రజలకు చేసిన ఆహ్వానం ఇరు దేశాల ఉమ్మడి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తుచేస్తోందని పేర్కొంది. నేపాల్‌లో కొనసాగుతున్న లివింగ్ కుమారి సంప్రదాయం కూడా ఈ సాంస్కృతిక అనుబంధానికి ప్రత్యేకతను చేకూరుస్తోంది.

విద్యా రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు నేపాల్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) క్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదన, న్యాయశాస్త్రం, సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి రంగాల్లో స్కాలర్‌షిప్‌లు, శిక్షణ అవకాశాల విస్తరణ వంటి అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉపాధ్యాయులు, విద్యావేత్తల మధ్య మార్పిడి కార్యక్రమాలు, వృత్తి విద్యా శిక్షణ కేంద్రం ఏర్పాటు వంటి ప్రతిపాదనలు కూడా యువతకు కొత్త అవకాశాలను కల్పించనున్నాయి. అదేవిధంగా వ్యవసాయ పరిశోధన కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, వైద్య విద్యా సంస్థల మధ్య పరస్పర సహకారం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

ఈ సందర్భంగా ABVP జాతీయ ప్రధాన కార్యదర్శి డా. వీరేంద్ర సింగ్ సోలంకి మాట్లాడుతూ.. భారత్, నేపాల్ మధ్య సంబంధాలు కేవలం దౌత్యపరమైనవే కాకుండా శతాబ్దాల నాటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక బంధాలతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఇరు దేశాల యువత కలిసి పనిచేయడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉన్నత విద్య, వృత్తి శిక్షణలో సహకారాన్ని విస్తరించడం వల్ల యువతకు కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. యువత కేంద్రంగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ABVP స్వాగతిస్తోందని, భవిష్యత్తులో విద్యా, సాంస్కృతిక సహకారం ఇరు దేశాల స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.