
దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుడికి కులం, మతం, ప్రాంతం అడ్డుకాదని నిరూపించిన వీరుడు లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వానీ. ఒకప్పుడు ఉగ్రవాద ప్రభావానికి లోనై తప్పుడు మార్గంలో నడిచిన ఆయన.. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని భారత సైన్యంలో చేరారు. చివరకు దేశ రక్షణలో పోరాడుతూ వీరమరణం పొందారు. ఆయన జీవితం మార్పుకు, దేశభక్తికి, త్యాగానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
2018 నవంబర్ 25న జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా బటగుండ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో నజీర్ అహ్మద్ వానీ వీరమరణం పొందారు. ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులతో పోరాడి ఇద్దరిని మట్టుబెట్టడంతో పాటు తన సహచర సైనికుల ప్రాణాలను కాపాడేందుకు చివరి శ్వాస వరకు పోరాడారు.
తివాచీలు నేసిన బాలుడి నుంచి సైనికుడి వరకు..
కుల్గాం జిల్లాలోని చక్ అష్ముజి గ్రామంలో జన్మించిన నజీర్ అహ్మద్ వానీ చిన్నతనంలోనే కష్టాలను చూశారు. ఆయన తండ్రి వ్యవసాయంతో పాటు చిన్న దాబా నిర్వహించేవారు. కుటుంబానికి సహాయంగా నజీర్ తివాచీలు నేస్తూ జీవనం సాగించారు. గ్రామంలోని మాజీ సైనికుడి యుద్ధ గాథలు, శుభన్ జీ అనే కశ్మీరీ పండిట్ బోధనలు ఆయనపై ప్రభావం చూపాయి.
అయితే 1990వ దశకంలో కశ్మీర్‌లో నెలకొన్న అశాంతి పరిస్థితుల్లో తొలుత ఉగ్రవాద ప్రభావానికి లోనయ్యారు. కొంతకాలం భారత భద్రతా దళాలకు వ్యతిరేకంగా పనిచేశారు. అనంతరం ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఇఖ్వాన్ ద్వారా సాధారణ జీవితంలోకి వచ్చారు. 2004లో టెరిటోరియల్ ఆర్మీలోని 162వ బెటాలియన్ (జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫంట్రీ)లో చేరి దేశ సేవకు అంకితమయ్యారు.
ఉగ్రవాదులపై పోరాటంలో అసాధారణ ధైర్యం
భారత సైన్యంలో చేరిన తర్వాత రాష్ట్రీయ రైఫిల్స్‌తో కలిసి పలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొన్నారు. తన అసాధారణ ధైర్యసాహసాలకు గుర్తింపుగా రెండుసార్లు సేనా మెడల్ అందుకున్నారు.
2018లో బటగుండ్‌లో జరిగిన ఆపరేషన్ ఆయన జీవితంలో చివరి పోరాటంగా మారింది. తీవ్రంగా గాయపడినప్పటికీ వెనక్కి తగ్గకుండా ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. సహచర సైనికుల రక్షణ కోసం పోరాడుతూ ప్రాణత్యాగం చేశారు.
మరణానంతరం అశోక చక్ర పురస్కారం
నజీర్ అహ్మద్ వానీ అసాధారణ ధైర్యసాహసాలు, దేశం కోసం చేసిన త్యాగానికి గుర్తింపుగా మరణానంతరం దేశ అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం ‘అశోక చక్ర’ ప్రదానం చేశారు. ఈ గౌరవాన్ని అందుకున్న జమ్మూ కాశ్మీర్‌కు చెందిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారు.
రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా తన 2024 పుస్తకం ‘ఏ జనరల్ రెమినిసెస్: ఏ లైఫ్ అండర్ ఫైర్ ఇన్ కశ్మీర్’లో నజీర్ జీవిత ప్రయాణాన్ని వివరించారు.
తప్పు మార్గం నుంచి బయటపడి దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన నజీర్ అహ్మద్ వానీ జీవితం ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప సందేశం. దేశభక్తి, ధైర్యం, త్యాగానికి మతం అడ్డుకాదని ఆయన తన జీవితంతో చాటిచెప్పారు. భారత మాత రక్షణ కోసం ప్రాణాలర్పించిన ఈ వీర జవాన్ త్యాగం ఎప్పటికీ మరువలేనిది.




