
కేరళ ఆయుర్వేద వైద్యానికి ఆద్యుడిగా పేరొందిన డా.పన్నియంపిల్లి కృష్ణన్‌కుట్టి వారియర్ (100) కన్నుమూశారు. ఆయన కొట్టక్కల్ ఆర్య వైద్యశాల(కేఏఎస్) మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఆయుర్వేద వైద్యుడిగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మందికి ఆయన చికిత్స అందించారు. ఆయన వద్ద చికిత్స తీసుకున్నవారిలో భారత మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు సహా ఇతర దేశాధ్యక్షులు కూడా ఉన్నారు. 1999లో పద్మశ్రీ, 2010లో పద్మభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది. కొట్టక్కల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన వారియర్ తన 20వ ఏట కేఏఎస్‌లో చేరారు. తన 24వ ఏట చదువు పూర్తి కాగానే కేఏఎస్ ట్రస్టీగా బాధ్యతలు స్వీకరించారు. ఆరు దశాబ్దాలుగా అమూల్యమైన సేవలతోపాటు కేఏఎస్‌కు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చారు.
డా.పీకే వారియర్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయుర్వేద వైద్యం విశిష్టతను ఉన్నత శిఖరాలకు ఆయన తీసుకెళ్లారని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఆయుర్వేదానికి ఆయన చేసిన సేవలు జాతి మరువదంటూ ట్విటర్‌లో మోడీ పేర్కొన్నారు. ఆయన కృషి వల్లే ఆయుర్వేద వైద్యానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కిందని సీఎం పినరయ్ విజయన్ వెల్లడించారు. అసెంబ్లీ స్పీకర్ ఎంబీ రాజేశ్, ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్, కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ తదితరులు వారి మృతి పట్ల సంతాపం వెలిబుచ్చారు.





