News

8 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు విద్యార్థుల ప్రపంచ రికార్డు

6views

పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధన ఉంటే చిన్న వయసులోనూ అసాధారణ విజయాలు సాధించవచ్చని రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు నిరూపించారు. యోగాసనాల్లో తమకున్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకరు కేవలం 8 నిమిషాల 48 సెకన్లలో 108 సూర్య నమస్కారాలు పూర్తి చేయగా, మరొకరు ఏకధాటిగా 20 నిమిషాల పాటు శీర్షాసనంలో ఉండి రికార్డు సృష్టించాడు. వీరి ప్రతిభను గుర్తించిన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇద్దరికీ ధ్రువపత్రాలు అందించారు.

8 నిమిషాల 48 సెకన్లలో 108 సూర్య నమస్కారాలు
బరాన్‌ జిల్లాకు చెందిన అక్షత్ శర్మ, శివమ్ యోగి కేంద్రీయ కేంద్రీయ విద్యాలయంలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఈ రికార్డుల్లో మొదటి ఘనత అక్షత్ శర్మ పేరిట నమోదైంది. సాధారణంగా సూర్య నమస్కారాలు చేయడానికి శారీరక దృఢత్వంతో పాటు శ్వాసపై నియంత్రణ, కదలికల్లో సమన్వయం అవసరం. అలాంటిది అక్షత్ కేవలం 8 నిమిషాల 48 సెకన్ల వ్యవధిలో ఏకంగా 108 సూర్య నమస్కారాలను పూర్తి చేశాడు. తక్కువ సమయంలో ఇన్ని సూర్య నమస్కారాలు పూర్తి చేయడం అతడి సాధనకు, శారీరక సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది. ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ రికార్డుల జాబితాలో తన పేరును నమోదు చేసుకున్నాడు.

20 నిమిషాల పాటు శీర్షాసనం
మరోవైపు శివమ్ యోగి కూడా తన ప్రత్యేక ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. యోగాసనాల్లో అత్యంత ఏకాగ్రత, శరీర నియంత్రణ అవసరమయ్యే శీర్షాసనాన్ని అతడు ఏకధాటిగా 20 నిమిషాల పాటు ప్రదర్శించాడు. శరీరాన్ని తలపై సమతుల్యంగా నిలిపి ఇంతసేపు ఆసనాన్ని కొనసాగించడం సాధారణ విషయం కాదు. నిరంతర సాధన, పట్టుదలతో ఈ లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఈ ప్రదర్శనకు గుర్తింపుగా శివమ్‌కు కూడా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ధ్రువపత్రం లభించింది.

నెలల తరబడి కఠోర సాధన
యోగా పట్ల ఆసక్తితో కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా అక్షత్ శర్మ, శివమ్ సాధన చేస్తున్నారు. రోజూ సమయాన్ని కేటాయిస్తూ వివిధ ఆసనాల్లో నైపుణ్యం పెంచుకున్నారు. ఈ క్రమంలో ప్రాంతీయ స్థాయిలో నిర్వహించిన యోగా ఛాంపియన్‌షిప్‌లలోనూ పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. అంతర్జాతీయ రికార్డు సాధించాలనే లక్ష్యంతో గత నాలుగైదు నెలలుగా ఇద్దరూ మరింత కఠినంగా సాధన చేశారు. తమ ప్రదర్శనలను వీడియోల రూపంలో చిత్రీకరించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఆన్‌లైన్‌లో పంపించారు. వాటిని పరిశీలించిన నిర్వాహకులు ఇద్దరు విద్యార్థుల ప్రతిభను గుర్తించి ధ్రువపత్రాలు జారీ చేశారు. విద్యార్థులిద్దరూ ఈ స్థాయి విజయాన్ని సాధించడంలో పాఠశాల శారీరక విద్య ఉపాధ్యాయుడు డాక్టర్ లక్ష్య నాగర్, యోగా గురువు అజయ్ రాథోడ్ కీలక పాత్ర పోషించారు.