
పర్వత ప్రాంత యుద్ధంలో భారత సైన్యం దెబ్బను రుచి చూసిన చైనా.. మరో దుష్ట పన్నాగానికి తెరతీసింది. వాస్తవాధీన రేఖ వద్ద స్థానిక పరిస్థితులను తట్టుకునేలా టిబెట్ యువతను తమ సైన్యంలో చేర్చుకుంటూ.. భారత్‌పై వారిని ఉసిగొల్పేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచే నియామక ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ వెంబడి వారిని మోహరించి సైనిక కార్యకలాపాల కోసం వినియోగించాలని డ్రాగన్ భావిస్తోంది.
భారత సరిహద్దుల్లో సైనిక కార్యకలాపాల కోసం.. చైనా సైన్యం టిబెట్ యువతను తమ సైన్యంలోకి తీసుకొని వారికి శిక్షణ అందిస్తున్న సమాచారం భారత నిఘా వర్గాలకు అందింది. ఈ ఏడాది ఆరంభం నుంచి టిబెట్ యువతను సైన్యంలో చేర్చుకునే ప్రక్రియను చైనా ప్రారంభించినట్లు తెలుస్తోంది. గతేడాది లద్ధాఖ్‌లో జరిగిన ఘర్షణల సందర్భంగా భారత సైన్యానికి చెందిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్.. డ్రాగన్ సేనలను సమర్థంగా నిలువరించింది. దీంతో ఈ దళంలో ఉన్న టిబెటియన్ల శక్తిసామర్థ్యాలను గుర్తించిన చైనా ఈ కుటిల యత్నానికి తెరతీసింది. టిబెట్ యువతను సైన్యంలో చేర్చుకొని వారిని భారత సరిహద్దుల్లో మోహరించాలని కుట్రలు పన్నుతోంది.
సైన్యంలో చేర్చుకునే టిబెట్ యువతకు చైనా పట్ల రాజభక్తిని పెంపొందించేలా పలు రకాల పరీక్షలు, తర్ఫీదులు ఇస్తున్నట్లు సమాచారం. చైనా భాష (చైనీస్)ను నేర్పించడం, చైనా కమ్యూనిస్టు పార్టీ సర్వాధికారాన్ని అంగీకరించడం వారికి అలవాటు చేస్తోంది. సైన్యంలో టిబెటియన్ల నియామకంతో డ్రాగన్‌కు అనేక ప్రయోజనాలున్నాయి. ఈ నిర్ణయం ద్వారా టిబెట్ యువత చైనాను ఆమోదిస్తారని.. ఇదే సమయంలో లద్ధాఖ్ లాంటి పర్వత ప్రాంతాల్లో పనిచేసే చైనా సైనికుల మీద ఒత్తిడి తగ్గుతుందని డ్రాగన్ భావిస్తోంది.
1962 యుద్దం తర్వాత స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ విభాగాన్ని భారత్ ఏర్పాటుచేసింది. ఈ దళానికి భారత సైన్యంతోపాటు, అమెరికాకు చెందిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీఐఏ) శిక్షణ అందిస్తోంది. ఈ దళంలో టిబెటియన్ యువత మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. వారే చైనా సైన్యాన్ని నిలువరించారు.





