News

కరోనాతో మావోయిస్టు అగ్రనేత మృతి వార్త ఖరారు

165views

మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ అలియాస్‌ హెచ్‌బీ అలియాస్‌ లక్మాదాదా కరోనాతో మృతి చెందాడు. ఈ విషయాన్ని కొత్తగూడెం జిల్లా ఎస్పీ దత్‌ ధ్రువీకరించారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం సామాజిక మాధ్యమాల్లో పలు వార్తలు వచ్చాయి. దీంతో కొత్తగూడెం జిల్లా పోలీసులు అతడి గురించి సమాచారం సేకరించారు. హరిభూషణ్‌ ఈ నెల 21న కరోనాతో మృతి చెందాడని భద్రాద్రి ఎస్పీ తెలిపారు. కరోనాతోపాటు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడని వివరించారు. మరికొందరు మావోయిస్టులు కూడా కరోనా బారిన పడ్డారని.. పోలీసులను ఆశ్రయిస్తే మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.

మడగూడ నుంచి కేంద్ర కమిటీకి..

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం మడగూడకు చెందిన యాప నారాయణ పదో తరగతి వరకు చదువుకొని విప్లవ కార్యకలాపాల వైపు ఆకర్షితుడయ్యారు. గుత్తికోయ సామాజిక వర్గానికి చెందిన నారాయణ దండకారణ్యానికి బదిలీ అయ్యాక అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా నియమితులై కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న మార్గదర్శకత్వంలో బాధ్యతలు నిర్వర్తించారు. కాగా.. కొంతకాలం క్రితం హరిభూషణ్‌ను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.