
పేదరికాన్ని తగ్గించాలంటే జనాభాను నియంత్రించాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. తగినంత వరకు కుటుంబ నియంత్రణ విధానాన్ని అనుసరించాలని మైనారిటీలను కోరారు. శాసన సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 30 రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు.
మైనారిటీలలో పేదరికం ఎక్కువగా ఉందని, దీనిని తగ్గించడానికి ప్రభుత్వానికి సహకరించాలని మైనారిటీలను కోరారు. జనాభా పెరుగుదల కారణంగానే పేదరికం పెరుగుతోందన్నారు. పేదలందరికీ ప్రభుత్వమే సంరక్షకురాలన్నారు. పేదరికం, నిరక్షరాస్యత వంటివాటికి మూల కారణం జనాభా పెరుగుదల అని చెప్పారు. జనాభా పెరుగుదల సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు మైనారిటీల్లోని మహిళలను ప్రభుత్వం చైతన్యపరుస్తుందని చెప్పారు. మైనారిటీ వర్గానికి చెందిన నేతలు ఆత్మావలోకనం చేసుకోవాలని, జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ దిశగా ప్రజలను ప్రోత్సహించాలని కోరారు.





