
అమెరికా నిఘా విభాగం (US Intelligence) చీకటి చరిత్ర యావత్ ప్రపంచానికి ఎంతోకాలంగా తెలుసు అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ పేర్కొన్నారు. ఇరాక్‌లో అమెరికా జరిపిన సామూహిక విధ్వంసంపై వచ్చిన ఆరోపణలను ఝావో లిజియన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అంతేకాకుండా కొవిడ్ మూలాలపై తాజాగా మరోసారి దర్యాప్తు జరపాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. వాటిపై మరోసారి దర్యాప్తునకు ఆదేశించడం వెనక బైడెన్ ప్రభుత్వం ఉద్దేశం, ప్రయోజనాలు స్పష్టంగా తెలుస్తున్నాయని ఝావో లిజియన్ విమర్శించారు.
కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్‌నుంచి లీక్ అయినట్లు మరోసారి అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. కొవిడ్ మూలాలపై భిన్న వాదనలు వస్తున్న తరణంలో వాటి మూలాలపై నిగ్గుతేల్చాలని అమెరికా నిఘా విభాగాన్ని అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. జంతువుల నుంచి మానవులకు సోకిందా? లేక ల్యాబ్‌నుంచి బయటకు వచ్చిందా? అనే విషయంపై మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టంచేశారు.
ఈ నేపథ్యంలో వైరస్ వుహాన్ ల్యాబ్‌నుంచి వచ్చిందంటూ అమెరికా చేస్తోన్న వాదనను తిప్పికొట్టిన చైనా.. ఆ దేశంలో కరోనా వైరస్ వల్ల సంభవించిన మరణాల రేటు నుంచి దృష్టి మరల్చేందుకు అమెరికా ఇలాంటి కుట్రలు, రాజకీయాలు చేస్తోందని ఆరోపించింది.
ఇదిలాఉంటే, కొవిడ్-19 మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని నిపుణుల బృందం ఇప్పటికే దర్యాప్తు జరిపింది. ల్యాబ్ నుంచి లీక్ అయ్యిందంటూ వచ్చిన వాదనలను కొట్టిపారేసింది. జంతువుల నుంచి ఇతర జీవుల ద్వారా మానవులకు సోకివుండవచ్చని నివేదించింది. అయితే, నివేదికను ఆలస్యంగా విడుదల చేయడం, డబ్ల్యూహెచ్‌ఓ బృందం చెప్పిన వివరాలపై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇక వైరస్ వెలుగు చూసే కొద్ది వారాల ముందు వుహాన్ ల్యాబ్‌లోని ముగ్గురు పరిశోధకులు కొవిడ్-19 లక్షణాలతో ఆసుపత్రి పాలైనట్లు వార్తా కథనాలు వెలుబడ్డాయి. దీంతో కొవిడ్ మూలాలపై చైనాలో మరోసారి దర్యాప్తు నిర్వహించాలన్న అంశంపై డిమాండ్ పెరుగుతోంది.
అయితే, ఇలా వుహాన్ ల్యాబ్‌పై వస్తోన్న వార్తలను ఖండించిన చైనా.. అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉన్న బయోల్యాబ్‌లో నుంచే ఆ వైరస్ వచ్చి ఉంటుందని ఆరోపించింది. ఆ ల్యాబ్‌లోకి డబ్ల్యూహెచ్‌వో నిపుణులను అనుమతించాలని డిమాండ్ చేసింది. ఇలా కొవిడ్ మూలాలపై ఇరుదేశాల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది.





