దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం రెండు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాగా రానున్న రోజుల్లో దేశీయంగా భారీ స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి జరగనుందని పేర్కొంది. ముఖ్యంగా ఆగస్టు-డిసెంబర్ మధ్య కాలంలో 200కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇప్పటికే అనుమతి పొందిన, ప్రయోగ దశల్లో ఉన్న వ్యాక్సిన్ సంస్థలు ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఈ అంచనాలు రూపొందించామని వెల్లడించింది.
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీలో ఎదురవుతున్న సమస్యలను త్వరలోనే అధిగమిస్తామని భారత ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇందుకు రానున్న రోజుల్లో భారీ స్థాయిలో టీకా ఉత్పత్తి దేశంలోనే జరుగనుందని పేర్కొంది. ఆగస్టు-డిసెంబర్ నాటికి దాదాపు 216 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని అంచనా వేసింది. వీటిలో 75కోట్ల కొవిషీల్డ్, 55కోట్ల కొవాగ్జిన్ డోసులతో పాటు బయోలాజికల్ ఇ, జైడస్ క్యాడిలా, నోవావాక్స్, భారత్ బయోటెక్(ముక్కు ద్వారా తీసుకునే టీకా), జిన్నోవా, స్పుత్నిక్ వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. అంతేకాకుండా వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికి ఈ సంఖ్య 300కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. ఇప్పటికే అనుమతి పొందిన మూడు వ్యాక్సిన్లతో పాటు ప్రయోగ దశల్లో ఉన్న వ్యాక్సిన్ సంస్థలు ఇచ్చిన నివేదికలను బట్టి ఈ అంచనాను రూపొందించినట్లు నీతి ఆయోగ్ సభ్యులు (ఆరోగ్యం) వీకే పాల్ పేర్కొన్నారు.
దేశంలో మూడోవంతు మందికి తొలిడోసు పూర్తి
దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి (114రోజుల్లో) 17.72కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అమెరికా, చైనా తర్వాత వ్యాక్సినేషన్‌లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోందని తెలిపింది. ఇక దేశంలో ఉన్న 45ఏళ్లపైబడిన వారిలో దాదాపు మూడోవంతు మందికి వ్యాక్సిన్ తొలిడోసు ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ వయసు వారిలోనే కొవిడ్ మరణాలు 88శాతం ఉన్న విషయాన్ని గుర్తుచేసిన నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్, వారి ప్రాణాలను రక్షించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పారు.