ArticlesNewsvideos

మతమార్పిళ్లపై విచారణకు AP రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసిన జాతీయ బాలల హక్కుల కమీషన్

627views

నాథ శరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులు, లైంగిక వేధింపుల‌కు గురైన బాలికల స‌మాచారాన్ని విదేశీ సంస్థలకు చేరవేస్తున్న వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెండు సంస్థల కార్యకలాపాలపై విచారణ జరిపించాల్సిందిగా కోరుతూ జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు జాతీయ బాలల హక్కుల కమిషనుకు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ చేసిన ఫిర్యాదు ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన ‘నజరత్ అసోసియేషన్ ఫర్ సోషల్ అవేర్నెస్’, ‘నజరత్ ఎడ్యుకేషనల్ సొసైటీ’ సంస్థలు స్కాట్లాండులోని ‘స్కాటిష్ లవ్ ఇన్ యాక్షన్’ అనే సంస్థతో కలిసి పనిచేస్తున్నాయి. ‘నజరత్ అసోసియేషన్ ఫర్ సోషల్ అవేర్నెస్’ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనాథ శరణాలయాలు నిర్వహిస్తుండగా వాటిలో సుమారు 900 మంది బాలబాలికలు ఆశ్రయం పొందుతున్నారు.

వీరికి ‘నజరత్ ఎడ్యుకేషనల్ సొసైటీ’ సంస్థ విద్యను అందిస్తోంది. ఈ రెండు సంస్థలూ విదేశీ విరాళాలు స్వీకరించేందుకు వీలుగా ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద లైసెన్సులు పొందాయి. అనాథ శరణాలయాల నిర్వహణ నిమిత్తం ‘స్కాటిష్ లవ్ ఇన్ యాక్షన్’ సంస్థ ‘నజరత్ అసోసియేషన్ ఫర్ సోషల్ అవేర్నెస్’కు స్కాట్లాండ్ నుండి విరాళాలు అందజేస్తుండగా, వాటిని తమ శరణాలయంలోని బాలబాలికలకు విద్యను అందిస్తోన్న ‘నజరత్ ఎడ్యుకేషనల్ సొసైటీ’కి అందిస్తూ వస్తోంది.

అనాథ శరణాలయాల్లోని పిల్లలు, లైంగిక వేధింపులకు గురైన బాలికల వివరాలు ఈ రెండు సంస్థలు స్కాట్లాండ్ సంస్థకు చేరవేస్తూ, వాటి ద్వారా విదేశీ విరాళాలు సమకూర్చుకునే క్రమంలో ప్రచారం కోసం వినియోగిస్తున్న అంశాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ బాలల హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళింది. ఇది బాలబాలికల వ్యక్తిగత స్వేచ్చకు విఘాతం కలిగించే అంశమని, జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015లోని సెక్షన్ 74 క్రింద నేరమని తమ ఫిర్యాదులో పేర్కొంది.

అంతే కాకుండా, ‘నజరత్ ఎడ్యుకేషనల్ సొసైటీ’ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు నూతలపాటి సోనీ వుడ్.. తమ కులం, మతం తెలియని అనాథ పిల్లలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ‘క్రైస్తవులు’గా నమోదు చేశాం అని బహిరంగ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను కూడా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళింది. ఇది బాలబాలికల మతపరమైన గుర్తింపు తుడిచివేసి, మరో మతాన్ని వారిపై రుద్దటం అనేది 1989లో ఐక్యరాజ్యసమితి దేశాలు బాలల హక్కుల రక్షణపై చేసుకున్న ఒప్పందంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘించినట్టే అని గుర్తుచేసింది.

అంతే కాకుండా ‘స్కాటిష్ లవ్ ఇన్ యాక్షన్’ సంస్థ ‘నజరత్ అసోసియేషన్ ఫర్ సోషల్ అవేర్నెస్’ నడిపే అనాథ శరణాలయాల్లోని పిల్లలకు సేవ చేసేందుకు వాలంటీర్లుగా విదేశీయులను భారత్ పంపే కార్యక్రమం చేపట్టిందని, అలా పంపేవారు టూరిస్టుల రూపంలో వస్తుండటం ‘ఫారినర్స్ యాక్ట్ 1946’లోని సెక్షన్ 14(బి) ప్రకారం వీసా నిబంధనల ఉల్లంఘన కిందకు రావడమే కాకుండా, ఇది అనాథ శరణాలయాల్లో తలదాచుకుంటున్న బాలబాలికల భద్రతకు పొంచివున్న ముప్పు అని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కమిషనుకు తెలిపింది. ఇప్పటికే అనేక మంది విదేశీయలు ఆ పిల్లలను కలిసి వెళ్లిన విషయాన్ని కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళింది.

లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఇచ్చిన ఫిర్యాదుపై జాతీయ బాలల హక్కుల కమిషన్ తక్షణమే స్పందించింది. ఎన్జీఓ సంస్థ‌లు లైంగిక వేధింపుల‌కు గురైన చిన్‌పపిల్ల‌ల స‌మాచారాన్ని విదేశీ సంస్థలకు చేరవేయడాన్ని త‌ప్పుబ‌ట్టింది. లైంగిక వేధింపులకు గురైన పిల్లల ఫోటోలు లేదా వారి స‌మాచారాన్ని ఇతరులకు చేరవేయడం జువైనైవ‌ల్ జ‌స్టిస్ 2015 (పిల్ల‌ల సంర‌క్ష‌ణ‌) చ‌ట్టంలోని సెక్షన్ 74తో పాటు భారతీయ శిక్షాస్మృతి లోని 228 ఎ కింద ఉల్లంఘనే అవుతుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రధాన కార్యదర్శికి వ్రాసిన లేఖలో పేర్కొంది. అసలు ఈ రెండు స్వచ్ఛంద సంస్థలూ తమ అనాథ శరణాలయాల్లోని బాలబాలికలను మొదట చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచాయా? లేదా? అన్న అనుమానం వ్యక్తం చేసింది.

ఈ మొత్తం వ్య‌వ‌హారంపై పూర్తి స్థాయిలో విచార‌ణ చేప‌ట్టి, త‌గిన చ‌ర్య‌లు తీసుకుని, చర్యల వివరాలను తెలియజేస్తూ ఏడు రోజుల్లో తమకు నివేదిక ఇవ్వాల్సిందిగా కోరింది.

Source : NIJAM TODAY

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.