
భారత్‌లో తన ఉగ్ర నెట్‌వర్క్‌ను విస్తరించడానికి పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. 2024లో పంజాబ్ యూట్యూబర్ రోజెర్ సంధూ ఇంటి వద్ద కాల్పుల కేసులో ఐఎస్‌ఐతో సంబంధమున్న పాక్ గ్యాంగ్‌స్టర్ పేరు బయటకు రావడంతో ఈ అనుమానం నెలకొంది. భారత్‌లో జరిగిన పలు దాడుల్లో పాక్ గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టీ హస్తం ఉంది. గతంలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో కూడా అతడి పేరు బయటకు వచ్చింది. అతడు దుబాయ్‌లో ఉంటూ భారత్‌లో దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
2024లో పంజాబ్‌లోని యూట్యూబర్ రోజెర్ సంధూ ఇంటి వద్ద కాల్పుల వెనక షహజాద్ భట్టీ ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా అతడు సోషల్ మీడియా వేదికగా.. మతపరమైన రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడు. వాటితో దేశంలో పలు ప్రాంతాల్లోని యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా అతడితో సంప్రదింపులు జరుపుతున్న మధ్యప్రదేశ్, యూపీ, జమ్మూకశ్మీర్, పంజాబ్, గుజరాత్‌లకు చెందిన 9 మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దిల్లీ సహా దేశంలోని ప్రసిద్ధ రెస్టారంట్లు, రద్దీ ప్రదేశాలు, హరియాణాలోని సైనిక స్థావరాలపై కాల్పులు జరపాలని షహజాద్ వీరికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
తమ ముఠా ప్రపంచవ్యాప్తంగా 16-17 దేశాలలో విస్తరించి ఉందని షహజాద్ చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 300 మంది యువకులు తనతో కలిసి పనిచేస్తున్నారని అతడు తెలిపాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తోనూ అతడికి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అతడి కోసం గాలింపు చేపట్టింది.





