
తమిళనాడు రాజకీయాల్లో సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులో డీఎంకే స్టాలిన్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. గత కొన్ని ఏళ్లుగా ఆ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ అధినేతనే జనాలు ఘోరంగా ఓడగొట్టారు. గతంలో డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సైతం ఆ పార్టీని ఓడగొట్టడానికి ఓ కారణం. ఘోరపరాజయాన్ని చవిచూసినప్పటికీ.. ఉదయనిధి స్టాలిన్‌లో ఏ మాత్రం మార్పు రాలేదు.
డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మంగళవారం తమిళనాడు శాసనసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ, సనాతన ధర్మంపై తన పాత వ్యాఖ్యలను మరోసారి పునరుద్ఘాటించారు.
సభలో ప్రసంగించిన ఆయన, “మనుషుల మధ్య విభజన, దూరాన్ని పెంచే సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే” అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో సభలో హుందాతనం, పరస్పర గౌరవం కాపాడుకోవాల్సిన అవసరాన్ని కూడా ప్రస్తావించారు.
గతంలో కూడా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని “నిర్మూలించాలి” అని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీశాయి. హిందూ సంఘాలు, పలు ఆధ్యాత్మిక వర్గాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించగా, డీఎంకేపై విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రస్తుతం అసెంబ్లీలో మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించడం రాజకీయంగా చర్చకు దారితీసింది. సనాతన ధర్మం కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక అని, అలాంటి వ్యాఖ్యలు సమాజంలో విభజనకు దారితీసే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక డీఎంకే హిందూ విశ్వాసాలపై పదేపదే వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీ వైఖరిని స్పష్టంగా చూపిస్తోందని విమర్శిస్తున్నాయి.




