
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల పేరుతో నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించిన సంఘాల నాయకులు ఇప్పుడు తాజాగా తాము చర్చలకు సిద్ధమేనని ప్రకటించారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రైతులు పెద్దఎత్తున గుమిగూడితే వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉండటంతో ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలని కేంద్రం నిశ్చయించుకుంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతు సంఘాల నాయకులు తమ నిరసనలు వాయిదా వేసి ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయత్ కూడా సానుకూలంగా స్పందించాడు. తామూ చర్చలకు సిద్ధంగా ఉన్నామని, కానీ ఆ చట్టాలను రద్దు చేయడమే ఈ సమస్యకు పరిష్కారమని చెప్పాడు. గతంలో చర్చలను ఎక్కడైతే ముగించారో.. అక్కడి నుంచే తిరిగి మొదలుపెడతామన్నాడు. ‘ప్రభుత్వంతో చర్చించడానికి సిద్ధం. మా డిమాండ్లలో మార్పేమీ లేదు. ఆ మూడు చట్టాలను రద్దు చేసి.. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కల్పించే కొత్త చట్టాన్ని తీసుకురావాలి’ అని టికాయత్ చెప్పాడు.





