News

మమ్మల్ని కొట్టి, ఆయుధాలు లాక్కోబోయారు, అందుకే కాల్పులు : సీఐఎస్‌ఎఫ్‌ అధికార వర్గాల వివరణ

647views

శ్చిమబెంగాల్‌లో నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతున్న వేళ కోచ్‌బిహార్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటన రాజకీయ దుమారానికి దారితీసింది. ఘటన నేపథ్యంలో భాజపా, తృణమూల్‌ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే హింసకు దారితీసిన పరిస్థితులు ఏంటీ..? కాల్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందన్న దానిపై సీఐఎస్‌ఎఫ్‌ అధికార వర్గాలు వివరణ ఇచ్చాయి. స్థానికులు తమపై దాడి చేయడం, ఆ క్రమంలో ఓ చిన్నారి గాయపడటంతోనే ఉద్రికత్త చోటుచేసుకుందని వెల్లడించాయి.

”ఘర్షణ జరిగిన రోజు ఉదయం 9.35 గంటల ప్రాంతంలో సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన క్విక్‌ రియాక్షన్‌ బృందం స్థానిక పోలీసులతో కలిసి సీతల్‌కుచి నియోజకవర్గంలోని జోర్‌పట్కి ప్రాంతంలో పెట్రోలింగ్‌ నిర్వహించింది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లకుండా ఆపుతున్న 50-60 మందిని కేంద్రబలగాలు అడ్డుకున్నాయి. ఈ గొడవలో ఓ చిన్నారికి గాయమై కిందపడింది. దీంతో ఆందోళనకారులు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిపై, వారి వాహనాలపై దాడికి దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కేంద్ర బలగాలు గాల్లో ఆరు రౌండ్ల కాల్పులు జరిపాయి. డిప్యూటీ కమాండెంట్‌ ర్యాంక్‌ అధికారి అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు” అని సీఐఎస్‌ఎఫ్‌ వర్గాలు వివరించాయి.

అయితే ఈ ఘటన జరిగిన ఒక గంట తర్వాత దాదాపు 150 మంది స్థానికులు పోలింగ్ కేంద్రానికి చేరుకుని పోలింగ్‌ సిబ్బందిపై దాడి చేశారని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. హోంగార్డ్‌ జవాను, ఆశా కార్యకర్తపై దాడి చేయడమేగాక, విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేశారని చెప్పారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో ప్రాణరక్షణ కోసం భద్రతాసిబ్బంది ఆందోళనకారులపై కాల్పులు జరిపారని ఆ అధికారి వెల్లడించారు. ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటన నేపథ్యంలో సీతల్‌కుచిలోని 126 వ పోలింగ్‌ కేంద్రంలో ఓటింగ్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.