News

రాష్ట్ర వ్యాప్తంగా సక్షమ్ సేవా కార్యక్రమాలు

633views

దివ్యాంగుల కోసం దేశ వ్యాప్తంగా పలు సేవా ప్రకల్పాలను నిర్వహిస్తున్న సక్షమ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో గత నెల రోజుల వ్యవధిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. వాటిలో కొన్నింటి వివరాలు తెలుసుకుందాం.

అనంతపురంలో కంటి పరీక్షల వాహనం ప్రారంభం

సక్షమ్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించే వాహనాన్ని ఆరోగ్య భారతి అఖిలభారత కార్యదర్శి డాక్టర్ మురళీ కృష్ణ అనంతపురంలో ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు వారి వారి గ్రామాలలో ఆ వాహనంలోనే కంటి పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఆ వాహనాన్ని రూపొందించారు. అలాగే కంటి పరీక్షలలో సమస్య నిర్ధారణ అయిన తర్వాత ఆపరేషన్లు అవసరమైన వారిని పట్టణాల్లోని ఆసుపత్రులకు తరలించడానికి కూడా ఉపయోగపడేలా వాహనాన్ని రూపొందించామని నిర్వాహకులు తెలియజేశారు.

విశాఖలో…..

విశాఖపట్నంలో కూడా సక్షమ్, గాయత్రీ వైద్య పరిషత్ల సంయుక్త ఆధ్వర్యంలో కంటి పరీక్షల వాహనాన్ని విద్యా భారతి అఖిలభారత అధ్యక్షులు శ్రీ దూసి రామకృష్ణ ప్రారంభించారు. కార్యక్రమంలో గాయత్రీ వైద్య పరిషత్ మెడికల్ కాలేజ్ నిర్వాహకులు డాక్టర్ పి సోమరాజు, సక్షమ్ అఖిలభారత సంయుక్త కార్యదర్శి డాక్టర్ సంతోష్, సక్షమ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ AVS మూర్తి తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు : అంథులకు ఊతకర్రల అందజేత

రెండవ బెటాలియన్ పోలీస్ పెన్షనర్స్ అసోసియేషన్, కర్నూలు సక్షమ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలులో అంథ యువతీ యువకులకు ఊతకర్రలు( కేన్స్) అందజేశారు. ఈ కార్యక్రమంలో సక్షమ్ కర్నూలు నగర కార్యదర్శి శ్రీ పెద్ద స్వామి, తలసీమియా ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ శ్రీకాంత్ పాల్గొన్నారు.

విజయవాడలో తల్లిదండ్రుల అవగాహనా సదస్సు

సక్షమ్ మరియు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI) ల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని చుట్టుగుంటలో గల ఎల్ఐసి భవన్ నందు మానసికంగా ఎదగని, ఇతరుల సహాయ సహకారాలు, సంరక్షణ అవసరమైన పిల్లల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ సి ఐ సభ్యులు శ్రీ వి రామారావు, సక్షమ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఏ వి ఎస్ మూర్తి, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.